Thursday, August 20, 2026
HomeTelanganaరూపారెడ్డి హత్యకు నిరసనగా మంచిర్యాలలో క్యాండిల్ ర్యాలీ

రూపారెడ్డి హత్యకు నిరసనగా మంచిర్యాలలో క్యాండిల్ ర్యాలీ

నిందితులను కఠినంగా శిక్షించాలి.. ట్రస్మా డిమాండ్

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, ఆగస్టు 20, ( ఆంజనేయులు న్యూస్ )

నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ మంచిర్యాల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రతినిధులు, ఉపాధ్యాయులు క్యాండిల్స్ చేతబట్టి జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. క్యాండిల్ ర్యాలీ ఐబీ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగా, అక్కడ రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్మా ప్రతినిధులు మాట్లాడుతూ విద్యారంగంలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య తీవ్రంగా బాధించిందన్నారు. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బందికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యా సంస్థల్లో పనిచేసే వారిపై దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రూపారెడ్డి హత్య ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి తగిన న్యాయం చేయాలని కోరారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యా సంస్థల వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రూపారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ట్రస్మా ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ట్రస్మా నాయకులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.