
మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు కార్యచరణ రూపొందించాలని, ఎవరైనా విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన దిశగా చేపట్టబోయే కార్యక్రమాలపై కార్యచరణ సిద్ధం చేసి ఈ నెల 16వ తేదీ లోగా అందించాలని అధికారులను ఆదేశించారు. 18 సం||ల వయస్సు లోపు గల పిల్లలు ఎవరు కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పిల్లలు వినియోగించకుండా చూడాలని తెలిపారు. వార్తాపత్రికలు, ఛానళ్ళు, ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని, మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి రీ-హాబిటేషన్ కేంద్రాలకు పంపించాలని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తన, మార్పులను గమనించాలని, జూనియర్ కళాశాలల విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని తెలిపారు. జిల్లాలో విక్రయాలు జరుగకుండా, జిల్లాకు సరఫరా కాకుండా కట్టిదిట్టమైన నిఘా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో గంజాయి సాగు చేసే వారికి రైతుబంధు నిలిపివేయాలని, జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో వైన్షాపులు లేకుండా విద్యా శాఖ, ఆబ్కారీ- మద్యపాన నిషేధ, రెవెన్యూ, సంక్షేమశాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని, వయస్సు అర్హత లేని వారికి పొగాకు ఉత్పత్తులు, వైన్షాపులు, డ్రగ్స్ విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో స్వచ్ఛంద సంస్థల సభ్యులు భాగస్వామ్యులవ్వాలని, మారుమూల గ్రామాలు, పురపాలక సంఘాలలో ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, నిర్మూలన చర్యలలో ప్రతి శాఖ పాలు పంచుకోవాలని తెలిపారు. ఎవరైనా చిన్న పిల్లలకు మాదక ద్రవ్యాలు విక్రయించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య, మంచిర్యాల సి.ఐ. నారాయణ నాయక్, అబ్కారీ శాఖ పర్యవేక్షకులు, సి.డబ్ల్యు.సి. చైర్మన్ వహీద్, సభ్యులు అనిల్, డి.సి.పి.ఓ. ఆనంద్, విద్యాశాఖ అధికారి సప్టర్ అలీఖాన్, డ్రగ్ ఇన్స్పెక్టర్, పోలీసు శాఖ అధికారులు, డి.సి.పి.యు. సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
