Monday, August 17, 2026
HomeTelanganaఅధికారులు లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి.

అధికారులు లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి.

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో కేటాయించిన లక్ష్యాలను సాధించే దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రయత్నం చేస్తూనే ఉండాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో కేటాయించిన లక్ష్యాలను సాధించే దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రయత్నం చేస్తూనే ఉండాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి గ్రామాలలో పారిశుద్ధ్యం, నర్సరీ, కంపోస్టు షెడ్లు, వంటశాలలు తదితర అంశాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో కేటాయించిన లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని, జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పరిశుభ్రంగా ఉండే విధంగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, ప్రతి రోజు ఇంటింటి నుండి తడి, పొడి, ప్లాస్టిక్ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, ఈ క్రమంలో ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో స్వయం సహాయ సంఘాల సభ్యులు, వి.ఓ.లతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాలలో ఏ ప్రాంతాలలో కూడా చెత్త కనపడకుండా గ్రామపంచాయతీ సిబ్బంది పనులు చేసేలా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడం జరిగిందని, ఎవరైనా వినియోగించినట్లయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ మేరకు ప్రజలలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాలల వివరాల జాబితాను తయారు చేయాలని తెలిపారు. ప్రతి షాపు, చిరు వ్యాపారాలలో ఒక చెత్తబుట్టను ఏర్పాటు చేసుకోవాలని, బయట చెత్త వేయకూడదని నిర్వాహకులకు తెలియజేయాలని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల స్థాయి నుండి పారిశుద్ధ్యం, క్రమశిక్షణ అలవర్చుకున్నట్లయితే భవిష్యత్తు క్రమపద్ధతిలో కొనసాగుతుందని, ఉపాధ్యాయులు చిన్నతనంలోనే విద్యార్థినీ, విద్యార్థులకు సమాజంపై అవగాహన కల్పిస్తూ క్రమశిక్షణ అలవాటు చేయాలని, మన ఊరు, మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని, మార్పు మన నుండే ప్రారంభం కావాలని తెలిపారు. పల్లెప్రగతిలో పనులకు గాను సిబ్బంది అన్ని రకాల పరికరాలు, వాహనాలు ఇతరత్రా సామాగ్రి సమకూర్చడం జరిగిందని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకుండా పనులు చేయాలని, గ్రామపంచాయతీ కార్యదర్శులు వారికి కేటాయించిన విధులలో తప్పనిసరిగా హాజరు అయ్యే విధంగా మండల పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని, పనుల నిర్వహణపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండలాల వారిగా పారిశుద్ధ్యం, నర్సరీలు, పల్లెప్రకృతి వనాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. పంచాయతీ చట్టాన్ని అమలు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, 10 రోజుల్లో కేటాయించిన అన్ని ప్రాంతాలలో సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.