
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: మహరాష్ట్ర సరిహద్దులో భూకంపం వచ్చింది. తెలంగాణ సరిహద్దుకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి 12: 41:35 గంటలకు భూకంపం సంభవించింది. గడ్చిరోలి జిల్లాకు దక్షిణ ప్రాంతమైన సిరోంచ తాలూక కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఉమనూర్-జింగనూర్ ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైనట్టు, రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నమోదైంది. అయితే అర్ధరాత్రి ఒక్క సారిగా భూమి కదిలినట్టు అయిందని సిరోంచ పట్టణంలోని ప్రజలు తెలుపుతున్నారు. ఈ భూకంపం ప్రభావం సరిహద్దులోని తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, మహదేవపూర్ ప్రాంతాల్లో కూడ ఉండి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ భూకంపం వలన తమకు ఏలాంటి నష్టం వాటిల్లలేదని సిరోంచ డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ అమీన్ తెలిపారు.
