Monday, August 17, 2026
HomePoliticalరాజభవన్ ముట్టడి ఉద్రిక్తం..?

రాజభవన్ ముట్టడి ఉద్రిక్తం..?

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ‘రాజభవన్ ముట్టడి’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ రాజభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ శ్రేణులు వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున రాజభవన్ కు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ద్విచక్రవాహనాన్ని ఆందోళన కారులు తగులబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బస్సుపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..

పోలీసుల అదుపులో ముఖ్యనేతలు..

మరోవైపు రాజభవన్ మార్గంలోకి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకొని కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, మహేశ్ కుమార్ తదితర నాయకులు రాజభవన్ వైపు వెళ్లారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట

రేవంత్ రెడ్డి ని స్టేషన్ కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వందలాది మంది కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు. రాజభవన్ లోకి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు యత్నించడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ నాయకుడు చామల కిరణ్ రెడ్డి, కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు.అనంతరం రేవంత్ రెడ్డి ని బొల్లారం, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిలను గోషామహల్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్ తదితరులను పంజాగుట్ట పీఎస్ లకు తరలించారు..

పోలీస్ కాలర్ పట్టుకొని లాగిన రేణుకా చౌదరి..!

నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ మహిళా నేతల అరెస్టుకు పోలీసులు యత్నించారు. రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఆమె పోలీస్ కాలర్ పట్టుకొని లాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య కంఠం నొక్కేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం రేణుకా చౌదరిని పోలీసులు బలవంతంగా వాహనంలో తరలించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.