
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారని.. బీఏసీ సమావేశం నిర్వహించకుండానే తేదీలను ఖరారు చేశారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తమ పార్టీ సభ్యులకు మూడు రోజులు మాట్లాడే అవకాశం దక్కుతుందనుకున్నామని.. సభలో కుర్చీలు వెతుక్కునేలోపే 6 నిమిషాల్లో అసెంబ్లీ వాయిదా పడిందని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ మీడియాతో మాట్లాడారు.
“బీఏసీ సమావేశానికి భాజపాను పిలవాలని స్పీకర్ ను కలిసి కోరా. గత ప్రభుత్వాల హయాంలో సీపీఎం, లోక్సత్తా పార్టీలకు ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నా బీఏసీకి పిలిచిన విషయాన్ని గుర్తు చేశా. ముగ్గురు ఎమ్మెల్యేలున్నా భాజపాను ఎందుకు పిలవడం లేదు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే పిలుస్తారో సభాపతి చెప్పాలి. అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యేల పట్ల వివక్షెందుకు? తెరాస, కాంగ్రెస్, మజ్లిస్ ఒక్కటే. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని కాంగ్రెస్, మజ్లిస్ ఎందుకు బీఏసీ సమావేశంలో డిమాండ్ చేయలేదు? 12, 13 తేదీల్లో భాజపా ఎమ్మెల్యేలను సభకు రానీయకుండా కుట్ర చేస్తున్నారు. అని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి పై రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సంప్రదాయం ప్రకారం నోటీసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. “మర మనిషి అంటే తప్పేముంది? అదేమైనా నిషిద్ధ పదమా? అలా అంటే సభా సంప్రదాయాలను అగౌరవపరిచినట్లా? బల్లలు ఎక్కినపుడు, మైకులు విసిరినపుడు, గవర్నర్ కుర్చీని తన్నినపుడు సభా సంప్రదాయం ఏమైంది?” అని రఘునందన్ ప్రశ్నించారు.

