Telugu Updates
Logo
Natyam ad

కేసీఆర్ కు భయం పట్టుకుంది: విజయశాంతి

రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండలేదు: విజయశాంతి.

నిజామాబాద్ జిల్లా: తెలంగాణలో భాజపా పాగా వేస్తుందని సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. రైతులను అడ్డంపెట్టుకుని భాజపాపై నిందలు వేస్తున్నారన్న ఆమె… బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సీఎం కేసీఆర్.. కేంద్రమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో నిర్వహించిన రైతు సదస్సులో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2014 నుంచి ధాన్యం కొనుగోలుపై లేని వివాదం ఇప్పుడే ఎందుకు వచ్చింది? తన పీఠం కదులుతోందన్న భయంతోనే కేసీఆర్ సమస్యగా మార్చారని అన్నారు. రైతులకు మేలు చేసే చట్టాలపై చేశారని, కాంగ్రెస్, దళారులు కలిసి రైతు చట్టాలను అడ్డుకునేందుకు కుట్రలు చేశారన్నారు. రూ. 2లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్.. ఇంకా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉచిత విద్యుత్ అంటూనే సర్వీస్ ఛార్జి ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీశారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండలేదన్నారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తామన్నారు. సైనికులను అవమానించేలా అనేక సార్లు మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. అత్యధిక రైతు ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణను మార్చారన్నారు. ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ చెప్పి ఐదేళ్లు అవుతోందని, పసుపు పంటకు మద్దతు ధర ఇచ్చి ఆయా గ్రామాల్లోనే కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అర్వింద్ ప్రశ్నించారు. రూ.10వేల రైతు బంధు రూ. 2వేల పింఛను ఇస్తే కుటుంబం గడుస్తుందా అని ప్రశ్నించారు..