పెనుగొండ: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం చేస్తున్నారు. పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. ప్రేమించిన వ్యక్తే తేజస్వినిని నమ్మించి హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై కుటుంబసభ్యులకు అనుమానాలు ఉండటంతో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. “తేజస్విని, సాదిక్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 4న యువతికి సాదిక్ ఫోన్ చేసి రమ్మన్నాడు. పొలంలోని రేకుల షెడు ఆమెను తీసుకెళ్లాడు. రెండుగంటలపాటు మాట్లాడుకున్నారు. రాత్రి కావడంతో భోజనం తెస్తానని షెడ్లోనే సాదిక్ ఆమెను వదిలి వెళ్లాడు. ఇంటి నుంచి మళ్లీ పొలంలోని షెడ్కు సాదిక్ వెళ్లేసరికి యువతి ఉరేసుకుని కనిపించింది. మొదటిసారి నిర్వహించిన పోస్టుమార్టంలో ఉరివేసుకున్నట్లు వచ్చింది..
మృతురాలి తల్లిదండ్రులు సామూహిక అత్యాచారం, హత్యగా అనుమానించారు. అందుకే రీ పోస్ట్మార్టంకి ఆదేశించాం” అని చెప్పారు. మృతురాలి ముఖంపై గాయాల ఫొటోను మీడియా ప్రతినిధులు మీడియాకు చూపించగా.. ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. డీఎస్పీ వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు..
మరోవైపు పెనుకొండ ఆస్పత్రి వద్ద తెదేపా నేతలు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ వాహనాన్ని తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఎస్పీ వాహనం ఎదుట తెదేపాతో పాటు వాల్మీకి సంఘం నేతలు బైఠాయించారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు..