ఆదిలాబాద్: బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఇంఛార్జి వీసీ వెంకటరమణను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆర్జీయూకేటీ ఇంఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ.. మంత్రితో భేటీ అయ్యారు. ఆర్జీయూకేటీలోని వివిధ సమస్యలపై చర్చించి పలు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేశామని తెలిపారు.
బోధన, భోజన, వసతి పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా.. విద్యార్థుల డిమాండ్లకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు తీసుకునే చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.