మంచిర్యాల ఏసీపీ కార్యాలయం ఎదుట ఘటన
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. స్థానిక చున్నంబట్టివాడకు చెందిన ఓ భూవివాదం కేసులో దాసరి నరేష్ అనే వ్యక్తి ఈనెల 19న తాడూరి పోశం, తూము మోహన్లపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసుస్టేషన్ లో పోశం, మోహన్ లపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. విచారణకు పోశం, మోహన్ లను తన కార్యాలయానికి రావాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ ఆదేశించారు. శుక్రవారం మోహన్ ఏసీపీ కార్యాలయానికి వచ్చిన క్రమంలో ముందస్తుగా తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అప్రమత్తమై వెంటనే అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భూవివాదంలో పోలీసులు తమపై ఒత్తిడి చేస్తున్నారని, మోహన్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.