Tuesday, August 18, 2026
HomeTelanganaశిథిలావస్థకు రెండు పడకగదుల ఇళ్లు.!

శిథిలావస్థకు రెండు పడకగదుల ఇళ్లు.!

📰 Generate e-Paper Clip

రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు. ఇళ్ల నిర్మాణం అధ్వానం

ప్రారంభించకుండానే శిథిలం

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: పేదల కోసం రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్న లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో ప్రారంభించకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు ఎవరికీ అక్కరకు రాకుండా నిరుపయోగంగా మారుతున్నాయి. వివిధ శాఖల ద్వారా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలన్నీ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎన్నికల కోడ్ రాకముందే లబ్ధిదారుల ఎంపిక జరిగినా.. వారికి పంపిణీ చేయడంలో విపరీతమైన జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. వెంటనే లబ్ధిదారులకు వీటిని అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఐటీడీఏ, ఆర్అండ్ బీ , పీఆర్ శాఖల ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కాగజ్నగర్ పట్టణంలో ఆర్అండ్ బీ శాఖ 288 ఇళ్లను పూర్తి చేసింది. సంపులు, విద్యుత్తు పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిని పూర్తి చేయడంలో తాత్సారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇళ్ల కిటీకీలు ధ్వంసమైపోతున్నాయి. చీకటి పడిందంటే మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. రెండు పడక గదుల ఇళ్లు ముందు ఉన్న ఖాళీ స్థలం సైతం ఆక్రమణలకు గురవుతోంది. మరో 192 ఇళ్లకు సంబంధించి పనులు పునాదుల వరకు వచ్చి నిలిచిపోయాయి. పనులు ప్రారంభించాక ఓ వ్యక్తి ఈ స్థలం తనదేనని కోర్టుకు వెళ్లడంతో ఈ ఇళ్ల పనులు ముందుకు సాగడం లేదు. మొత్తం రూ.17.14 కోట్లు ఖర్చు చేసినా ప్రజలకు ఎలాంటి ఉపయోగపడకుండా ఈ నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారు లు రెండు పడక గదుల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.