మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన స్వచ్ఛత హి సేవ- 2024 కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్తో కలిసి జిల్లా అధికారులతో స్వచ్ఛత హి సేవ కార్యక్రమ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటుట, స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఈ నెల 18న ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై అవగాహన, మానవహారం, వ్యాసరచన, స్వచ్ఛతపై చిత్రలేఖనం పోటీల నిర్వహణ, 19న గ్రామాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలలో సేవా దినం-శ్రమదాన కార్యక్రమాల నిర్వహణ, 20న డ్రై డేలో భాగంగా ఇంటింటికి వెళ్ళి పారిశుద్ధ్యం ఆవశ్యకత, దోమల నివారణ చర్యలు, గుర్తించిన నివాసాలలో మరుగుదొడ్ల నిర్మాణం మార్కింగ్, 2 గుంతల మరుగుదొడ్డి ఉపయోగాలపై అవగాహన కార్యక్రమాలు, 21న నీటి క్లోరినేషన్, మంచినీటి ట్యాంకులు శుభ్రపర్చడం, 23న సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్యంపై ఇంటింటి ప్రచారం, 24న మురుగు కాలువలలో చెత్త తొలగింపు, మురుగు కాలువల చివరలో కమ్యూనిటీ ఇంకుడుగుంతల నిర్మాణం, 25న తడి చెత్త, పొడి చెత్తపై ఇంటింటి అవగాహన కార్యక్రమాలు, పారిశుద్ధ్య అవసరంపై సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. స్వచ్ఛత హి సేవ-2024 కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం అందరిచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.