Telugu Updates
Logo
Natyam ad

విద్యార్థుల సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: విద్యార్థుల సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం జిల్లాలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు అంశాలపై వివరాలు తెలుసుకునేందుకు దాదాపు 40 పాఠశాలల ఉపాధ్యాయులకు వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, విద్యారంగ అభివృద్ధిలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నూతన మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు నాణ్యమైన విద్యా బోధన దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేస్తూ ప్రతి విద్యార్థికి మంచి భవిష్యత్తు అందించే దిశగా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోని మొగడ్ దగడ్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని గురుడిపేట గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సి.ఆర్.టి. కె. శారద గైర్హాజరు కావడంపై ఎస్. ఈ. ఆర్. పి. పోచం, ప్రధానోపాధ్యాయులు అశోక్ లను వివరణ కోరగా ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అయ్యారని తెలపడంతో సదరు సి. ఆర్. టి. ని విధుల నుండి తొలగించాలని ఆదేశించారు.