ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రహదారి భద్రతా మాసోత్సవాలు-2025లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే కళాజాత ద్వారా ఈ నెల 31వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం హాజీపూర్, గుడిపేట గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు రోడ్డు ప్రమాదాల నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు, ఇతర వాహనాల చోధకులు సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, కూడళ్ళ వద్ద సిగ్నల్స్ను తప్పనిసరిగా అనుసరించాలని, నియంత్రిత వేగంతో వాహనాన్ని నడపాలని కళాకారులు తమ ఆట-పాట ద్వారా వివరించారు. వాహనం నడిపే సమయంలో మొబైల్ ఫోన్ ఉ పయోగించకూడదని, మద్యం సేవించి వాహనం నడుపకూడదని, వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలియజేశారు. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటుందని, వేగ నిరోధకాలతో పాటు వాహనదారులు అర్థమయ్యే విధంగా ప్రమాద ప్రాంతాలు, మూలమలుపు ఇతర అన్ని ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తుందని, వాహనదారులు ఈ సూచికలను అనుసరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కొప్పర్తి రవీందర్, బీర్పూర్ శ్రీనివాస్, ముల్కల్ల మురళి, చేగొండ నిరోష, వడ్కపురం రవికుమార్, వెల్తూరు పోశం, రాంటెంకి తిరుపతి, వావిలాల నాగలక్ష్మి పాల్గొన్నారు.