ఉమ్మడి జిల్లాలోనే ‘ఏ’ గ్రేడ్ రైల్వేస్టేషన్ గా మంచిర్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలో స్వచ్ఛ రైల్వేస్టేషన్లలో రెండు సార్లు ఈ స్టేషన్ అవార్డులు సైతం పొందింది.
అమృత్ భారత్ స్టేషన్లలో మంచిర్యాలకు చోటు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఉమ్మడి జిల్లాలోనే ‘ఏ’ గ్రేడ్ రైల్వేస్టేషన్ గా మంచిర్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలో స్వచ్ఛ రైల్వేస్టేషన్లలో రెండు సార్లు ఈ స్టేషన్ అవార్డులు సైతం పొందింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనున్న అమృత్ భారత్ రైల్వేస్టేషన్లలో మంచిర్యాల స్టేషన్ ఎంపికైంది. రైల్వేశాఖలో పలు మార్పులకు శ్రీకారం చేపడుతున్న కేంద్రం చేపట్టిన ఈ పథకంతో.. మంచిర్యాలకు రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయి.
• ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి..
విదేశీ స్థాయిలో అబ్బురపరిచే నిర్మాణాలను చేపట్టి, చిన్న రైల్వేస్టేషన్లను ఆధునికీకరించేందుకు రైల్వేశాఖ సన్నద్ధమవుతోంది. స్టేషన్ల పునర్ నిర్మాణాల కోసం ప్రత్యేక నిధులను కేటాయించనున్నారు. ఇటీవలే దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ అధికారుల బృందం మంచిర్యాల రైల్వేస్టేషన్ ను పరిశీలించారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అవసరమో క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి వెళ్లారు. ఇప్పటికే ఒడిశాలోని ఖుర్దా జంక్షన్ ను ఈ పథకం ద్వారా అభివృద్ధి చేశారు. రూ.10 నుంచి రూ.20 కోట్ల అంచనాతో స్టేషన్ ను ఆధునికీకరించనున్నారు. ఏడాదిలోపే పనులు పూర్తిచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
• వివరాలు..
• నిత్యం మంచిర్యాలలో 15 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
• నిత్యం మంచిర్యాలలో నిలుస్తున్న రైళ్ల సంఖ్య : 17
• కలగనున్న సౌకర్యాలు ఇవే..
రాబోయే రోజుల్లో మంచిర్యాల రైల్వేస్టేషన్ లో ప్రధానంగా ముఖద్వారం, రైల్వేట్రాకుల నవీకరణ, విశ్రాంతి గదులు, దివ్యాంగులకు ప్రత్యేకమైన సౌకర్యాలు, శౌచాలయాలు, ప్రణాళికాబద్ధంగా పార్కింగ్, రోడ్డు విస్తరణ ఉంటాయి. మంచిర్యాల రైల్వేస్టేషన్ ఆవరణలో సుమారు పది ఎకరాలకు పైగా ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ తో పాటు మల్టిప్లెక్స్ లో నిర్మించే అవకాశం లేకపోలేదు. రెండో ప్లాట్ ఫారం అవతల టికెట్ కౌంటింగ్ తో పాటు విశ్రాంతి గదులు, శౌచాలయాలు అందుబాటులోకి రానున్నాయి. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు.

