హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని పెంచాలని కోరారు. పోలీస్ ఉద్యోగాల నియామకాల్లో వయో పరిమితి సడలింపు ఇవ్వాలని సీఎంను రేవంత్ రెడ్డి కోరారు. జాబ్ నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల వయోపరిమితితో చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ పోస్టులు అధికంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల లక్షలాది మంది ఉద్యోగాలకు దూరం అవుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్ల తరువాత నోటిఫికేషన్ రావడం, కరోనా వల్ల చాలా మంది జాబ్స్ కోల్పోయారని పేర్కొన్నారు.
యూపీఎస్సీ భర్తీ చేసే ఐపీఎస్ పోస్టులతో పాటు పలు రాష్ట్రాల యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి 32 ఏళ్లుగా ఉందని, కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో 5 ఏళ్లు వయోపరిమితి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆస్క్ కేటీఆర్ లో సమస్యను విన్నవించుకున్నా స్పందించలేదని, హోంశాఖ చూసే మంత్రి ఉన్నాడో లేదో తెలియదని రేవంత్ రెడ్డి విమర్శించారు. మీరేమే ఇవన్నీ పట్టనట్లు ఫామ్ హౌజ్ లో సేద తీరుతున్నారని సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి లేఖలో విమర్శించారు.