ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: హరియాణాలో ఉగ్రవాదులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పట్టుబడిన వ్యవహారంలో ఆదిలాబాద్ పేరు ప్రస్తావనకు రావడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ముష్కరులు ఇక్కడకు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు హరియాణా హోంమంత్రి వెల్లడించడం ప్రకంపనలు సృష్టించింది. జాతీయ దర్యాప్తు సంస్థ మూడురోజుల కిందటే ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమివ్వడంతో… వారు దీన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులతో అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఆదిలాబాద్ జిల్లా ప్రశాంతంగా ఉంటుందని, ఇక్కడకు ఆయుధాలను తరలిస్తే అనుమానాలకు ఆస్కారం ఉండదనే కారణంతోనే దీన్ని అనువైన స్థావరంగా ఉగ్రవాదులు ఎంచుకొని ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు చెబుతున్నారు..
ఇందుకు పలు కారణాలను పేర్కొంటున్నారు.
1) ఆదిలాబాద్ జిల్లా మీదుగా 44వ నంబరు జాతీయ రహదారి గుండా దిల్లీకి చేరుకోవచ్చు.
2) నిర్మల్ జిల్లా భైంసా గుండా నాందేడ్కు వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లొచ్చు.
3) మంచిర్యాల మీదుగా నేరుగా దిల్లీకి రైల్వే మార్గం ఉంది. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్డీఎక్స్లో పాటు ఆయుధాలను నిల్వచేసి ఉంచుకోవచ్చనే ఆలోచన ఉగ్రవాదులకు ఉండవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నతాధికారులంతా మంచిర్యాల, ఆదిలాబాద్, కాగజ్నగర్, నిర్మల్ ప్రాంతాలతో పాటు… దాబాల వద్ద ఇతరులెవరికీ అనుమానం రాకుండా కొత్త వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నారు. తెలంగాణా నిఘా విభాగం అధికారులు ఆదిలాబాద్ చేరుకుని, ఇక్కడ పరిస్థితులపై ఉన్నతాధికారులతో మంతనాలు సాగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జాతీయ, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఆదిలాబాద్ లో ఐఎస్ఐ కదలికలపై వేర్వేరుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. పాకిస్థాన్ కు చెందిన ఖలిస్థాన్ ఉగ్రవాది హరివిందర్సింగ్ రిండాతో ఇక్కడి సంబంధాలపైనా ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు. కాగా- జిల్లాలో ఖలిస్థాన్, ఐఎస్ఐ కదలికలు… ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను ఇక్కడకు తరలించాలనుకోవడంపై తనకు సమాచారం లేదని ఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు..