Telugu Updates
Logo
Natyam ad

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. లక్ష విలువైన హౌస్ వైర్ స్వాధీనం.?

నిర్మల్ జిల్లా: ఎలక్ట్రికల్ షాపులు లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నిర్మల్ పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల రతన్ ఎలక్ట్రికల్ దుకాణంలో ఫిబ్రవరి 14న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు రూ. 5 లక్షల విలువైన హౌస్ వైర్ దొంగిలించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఐదుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో వచ్చి దొంగతనం చేసినట్లు గుర్తించారు. వాహన కలర్ ఆధారంగా స్థానిక గంజాల్ టోల్ ప్లాజా వద్ద వాహన నంబర్, ఫాస్ట్ ట్యాగ్ అనుసంధానమైన మొబైల్ నెంబర్ తో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణకాంత్ సక్సేనా మొబైల్ లోకేషన్ ఆధారంగా బస్టాండ్ ప్రాంతంలో సోమవారం రాత్రి పట్టుబడ్డాడు. అతన్ని పోలీసులు విచారించగా రాజస్థాన్ కు చెందిన కులదీప్, జితేందర్, దేవారం, అనిల్ లతో పరిచయం ఏర్పడి నిర్మల్, ఇచ్చోడ, నిజామాబాద్ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. దొంగిలించిన హౌస్ వైర్ లను హైదరాబాద్ లోని విక్రయించారు. అందులో నుండి లక్ష రూపాయల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకుని చోరీకి పాల్పడ్డ నిందితుడు కృష్ణకాంత్ సక్సెనను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

త్వరలోనే మరో నలుగురు నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ చోరీ ఘటనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పట్టణ ఎస్సై రమణరావు, ఆర్ఎస్సై రవి, పోలీస్ సిబ్బంది సురేష్ గౌడ్, సందీప్, చిన్నయ్య, మన్సూర్, జామీర్ లను అభినందించారు