Telugu Updates
Logo
Natyam ad

డబ్బులిస్తేనే కుట్లేస్తాం..?

మానవత మరిచిన వరంగల్ ఎంజీఎం సిబ్బంది

గాయాలతో ఆసుపత్రికి వెళ్లిన దంపతుల దైన్యం

కుట్లువేయడానికి దారం లేదు, కట్టడానికి కాటన్ లేదు

వరంగల్: చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అనారోగ్యానికి లోనైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయనే పేదల నమ్మకాన్ని వమ్ము చేసే సంఘటన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వర్షానికి స్లాబ్ పెచ్చులూడి గాయపడిన దంపతులు రక్తం కారుతూ ఆసుపత్రికి వెళితే.. డబ్బు ఇవ్వనిదే వైద్యం చేయబోమని అక్కడి సిబ్బంది మానవత్వం మరిచి ప్రవర్తించారు. బింగి రామకృష్ణ, ఆయన భార్య సరస్వతి దేశాయిపేట వీవర్స్ కాలనీలో ఓ అద్దింటిలో ఉంటూ కూలినాలిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. వరసగా కురుస్తున్న వర్షాలకు ఆదివారం మధ్యాహ్నం ఇంటి స్లాబ్ పెచ్చులూడి వారి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తమోడుతున్న వారి వద్ద డబ్బులు లేవని తెలుసుకున్న స్థానికులు వారిని 108 అంబులెన్స్ లో ఎంజీఎం ఆసుపత్రికి పంపించారు. కుట్టు వేసే క్యాజువాలిటీ ఆపరేషన్ థియెటర్ (సీవోటీ)గదికి వెళ్లగా, కుట్లువేయడానికి దారం లేదు, కట్టడానికి కాటన్ లేదని, బయట కొనుక్కోండి అంటూ గద్దించారు. వారితో వచ్చిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఉచితంగా ఇవ్వాలేగానీ బయట ఎందుకు తెచ్చుకోవాలని అడగ్గా ఇక్కడలేవు.. ఆ విషయం సీఎం కేసీఆర్ కు తెలుసు అంటూ వెటకారపు మాటలతో వేధించారు. చేసేది లేక సరస్వతి కోసం బయటకు వెళ్లి రూ.320 ఖర్చుచేసి కుట్లు వేసే దారం, కాటన్ తీసుకొచ్చారు. భర్త రామకృష్ణకు కూడా దారం, కాటన్ బయటే తెచ్చుకోవాలని, లేదంటే తమకు ఆ డబ్బులిస్తే కుట్లు వేస్తామన్నారు. డబ్బులు డిమాండ్ చేసిన అంజాద్ అనే వార్డు బాయ్ కు రూ.350 ఇవ్వడంతో జేబులో ఉన్న కుట్టు దారం, కాటన్ తీసి రామకృష్ణకు కుట్లు వేశారు. ఇదంతా బాధితులతో వచ్చిన వారు మొబైల్లో రికార్డు చేయడాన్ని గమనించిన వార్డుబాయ్ వారి వద్ద ఉన్న ఫోన్ లాక్కొని రికార్డులన్నీ తొలగించాక వైద్యం చేశాడు.

బాధితుల తరపున వచ్చిన వారు కార్పొరేటర్ సురేశ్తోషి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి ఎంజీఎంకు వచ్చి ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ చంద్రశేఖర్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆర్ఎంవో డాక్టర్ ప్రసాద్ బాధితుల ఫిర్యాదు విషయం సూపరింటెండెంటు దృష్టికి తీసుకెళ్లామని, సోమవారం విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.