హైదరాబాద్: కొవిడ్ సమయంలో వైద్యులందించిన సేవలు చిరస్మరణీయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కుటుంబాలను వదిలి రోజుల తరబడి రోగులకు సేవలు చేశారని కొనియాడారు. యశోదా ఆస్పత్రి 10వ వార్షిక యంగ్ డాక్టర్స్ క్యాంప్ లో పాల్గొన్న ఆమె మాట్లాడారు. “ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రాబోతుంది. నగరానికి నలుమూలలా నాలుగు సూపర్ స్పెషలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నా. త్వరలో మెడికల్ సీట్లు భారీగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కష్టం వచ్చినప్పుడే బలంగా నిలబడాలి. ఏ రంగం ఎంచుకున్నా నిబద్ధత, మానవత్వంతో నడుచుకోవాలి. ఒకప్పుడు ఆడపిల్లలను చదివించాలంటే ఆలోచించే పరిస్థితి ఉండేది. మోడల్ స్కూల్స్ పరీక్ష పెట్టినప్పుడు చాలా మంది విభిన్న రకాల వృత్తులను ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపారు. ఒక పోర్టల్ ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం కెరీర్ గైడెన్స్ ఇస్తోంది” అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వైద్య విద్యపై ఆసక్తి కలిగిన విద్యార్థులకు దానిపై మరింత అవగాహన కల్పించేందుకు పదేళ్లుగా యశోదా ఆస్పత్రి యంగ్ డాక్టర్స్ క్యాంపు నిర్వహిస్తోంది.