పోలీసులు, మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరసన తెలుపుతున్న సమయంలో కొంత మంది మహిళా కాంగ్రెస్ నేతలు గాయపడ్డారు. ఈ అంశంపై ఇవాళ గాంధీ భవన్లో సమావేశమైన మహిళా కాంగ్రెస్ కార్యవర్గం.. డీజీపీకి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో డీజీపీని కలిసేందుకు గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వారిని అరెస్టు చేసిన పోలీసులు.. నారాయణగూడ పోలీసుస్టేషను తరలించారు. అరెస్టు చేసే సమయంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితా రావు ఫిట్స్ రావడంతో కిందపడిపోయారు. ఆమెను పోలీసులు హుటాహుటిన కేర్ ఆస్పత్రికి తరలించారు.