Telugu Updates
Logo
Natyam ad

మార్కెట్ లో నకిలీ నాసిరకం మందులు

మంచిర్యాలలో సీజ్ చేసిన అధికారులు

 ‘డ్రగ్స్ లైసెన్స్’ లేని కంపెనీ ఉత్పత్తుల అమ్మకం

జనాల ప్రాణాలకు ముప్పుగా మారిన ఫేక్ మెడిసిన్ రాకెట్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని కొన్ని మెడికల్ ఏజెన్సీలు అనుమతి లేని ట్యాబ్లెట్లను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. రోగాలను నయం చేసే ట్యాబ్లెట్లు డ్రగ్స్ లైసెన్స్ లేకుండా తయారీ చేస్తున్న కంపెనీల నుంచి తెచ్చి విక్రయిస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు గుర్తించారు. రెండ్రోజుల క్రితం జిల్లా కేంద్రంలో ని శ్రీరామ్ మెడికల్ ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న 1800 ట్యాబ్లెట్లు, రూ.30వేల విలువైన నకిలీ ‘క్లింథియా 100ఎంజీ’ ట్యాబ్లెట్స్(థయామిన్ హైడ్రోక్లోరైడ్ 100ఎంజీ) సీజ్ చేశారు. వీటిని బెరిబెరి, పెల్లగ్రా, వర్నికే-కొర్సాక ఆఫ్ సిండ్రోమ్, గర్భిణులకు సైతం రోగ నిరోధకత పెంచేందుకు కూడా వాడుతుంటున్నారు. ఇలాంటి కీలకమైన వ్యాధి నయం చేసే మందులను డ్రగ్స్ లైసెన్స్ పొందిన కంపెనీలే తయారీ చేసి విక్రయించాలి. అయితే ఆహార ఉత్పత్తుల కింద అనుమతి తీసుకుని హర్యానాలోని ఓ కంపెని తయారు చేసి విక్రయిస్తోంది. ఇది చట్టపరంగా విరుద్ధం. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నకిలీ మందులు అమ్ముతున్నట్లు ప్రభుత్వ దృష్టికి రావడంతో అన్ని చోట్ల తనిఖీలు ముమ్మరం చేశారు. మంచిర్యాల పట్టణంలో నూ డ్రగ్ లైసెన్స్ లేకుండా అమ్ముతున్న ట్యాబ్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు, దుకాణాలు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో పుట్టగొడుగుల్లాగా మందుల ఏజెన్సీలు, దుకాణాలు. వెలుస్తున్నాయి. కోవిడ్ తర్వాత మరింత ఎక్కువయ్యాయి. జిల్లాతోపాటు ఆసిఫాబాద్, మహారాష్ట్ర నుంచి వైద్యం, చిక్సిత, మందుల కోసం జిల్లాకు అనేక మంది రోగులు వస్తుంటారు. వీరి బలహీనతను ఆసరా చేసుకుని అనుమతి లేని మందులను కూడా మార్కెట్లో గుట్టుగా విక్రయిస్తున్నారు. కొన్ని ఏజెన్సీలు ధనార్జనే ప్రధాన ధ్యేయంగా ఇలాంటి ట్యాబ్లెట్లు ప్రజలకు అమ్ముతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ నిత్యం తనిఖీలు చేయాల్సి ఉన్నా చేయడం లేదు. ఇక ప్రజలు సైతం ఫిర్యాదులు ఇవ్వకపోవడంతో ఇలాంటివి వెలుగులోకి రావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న వాటిని గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం ప్రతీ ట్యాబ్లెట్, మందుల లేబుల్ జాగ్రత్తగా పరిశీలించాలి. ఆహార ఉత్పత్తికి సంబంధించినదా? లేక రోగాన్ని నయం చేసేదా? ఎక్కడ తయారీ చేస్తున్నారు? ధర, గడువు తేదీ, ఇతరవన్నీ కచ్చితంగా తెలుసుకున్నాకే కొనుగోలు చేయాలి. లేకపోతే ఆరోగ్యముప్పు కలిగే అవకాశం ఉంది. ఎవరిపైనైనా అనుమానం వస్తే డ్రగ్స్ కంట్రోల్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలి. ట్యాబ్లెట్లు, మందులు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.