Telugu Updates
Logo
Natyam ad

అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాల ఫలాలు

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు అర్హులైన ప్రతి లబ్దిదారుడికి అందేలా జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నోడల్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు, రీజనల్ మాస్టర్ ట్రైనర్ ప్రభాకర్ స్వామితో కలిసి అసిస్టెంట్ సెక్షన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు జిల్లాలోని బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి, జన్నారం మండలం తిమ్మాపూర్, తాండూర్ మండలం మాదారం, లక్షెట్టిపేట మండలం గుల్లకోట, హాజీపూర్ మండలం దొనబండ గ్రామాలలో ప్రజల స్థితిగతులు, ప్రభుత్వ పథకాల అమలుపై కేంద్రం నుండి వచ్చిన ప్రత్యేక బృందం అసిస్టెంట్ సెక్షన్ అధికారులు పరిశోధించడం జరిగిందని, ఈ నేపథ్యంలో వారి నుండి పథకాల సంబంధిత వివరాలు, చేయవలసిన మార్పులు, తీసుకోవలసిన చర్యల వివరాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల ద్వారా మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మొక్కలు నాటేందుకు జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను నర్సరీల ద్వారా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు మరింత చురుకుగా ఉండేందుకు ప్లేస్కూల్ తరహాలో ఏర్పాటు చేస్తే బావుంటుందని కేంద్ర బృంద సభ్యులు తెలుపగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు, అత్యవసర, మరమ్మత్తుల సమయాలలో తప్ప నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని, మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం పైప్ లైన్ లను విస్తరించి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా త్రాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు ఏకరూప దుస్తులు తయారు చేసేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లయితే మరిన్ని పనులు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి, మరమ్మత్తు పనులను చేపట్టి విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు అధిక మొత్తంలో వేతనాలు అందించడంతో పాటు వైద్యం, ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, విద్యుత్ సౌకర్యం లేని అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సోలార్ పవర్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, జిల్లాలోని ఉప కేంద్రాల కొరకు స్వంత భవనాలు సిద్ధం చేయడం జరుగుతుందని, ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అర్హత గల నిరుపేదలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో గృహ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు, యువత క్రీడా రంగంలో రాణించేందుకు ప్రోత్సాహకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పూర్తి స్థాయిలో వినియోగం జరుగుతోందని తెలిపారు. ప్రజల స్థితిగతులు, ప్రభుత్వ పథకాల అమలుపై కేంద్ర బృందం పరిశోధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ పథకాలు మరింత పకడ్బంధీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.