మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గల మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, ముఖ్య ప్రణాళిక అధికారి జి.సత్యం లతో కలిసి నియోజకవర్గ స్థాయి అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను పర్యవేక్షించి సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని శాఖల వారిగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిపై ఆయా శాఖల అధికారులు అందించే వివరాల ప్రకారం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాల నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాలని, పాఠశాలల్లో బాలబాలికలకు ప్రత్యేక మూత్రశాలలను రెండు నెలల లోగా పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, వ్యవసాయ, నీటిపారుదల, ఉద్యానవన, పురపాలక శాఖలు, ఇతర శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై 10 రోజులలోగా మండలాల వారిగా, శాఖల వారిగా సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. విధుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహించినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ.. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కొనసాగుతున్న పనులకు సంబంధించిన అనుమతులు తీసుకొని త్వరగా పూర్తి చేసే విధంగా కృషి చేయాలని, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా అడ ప్రాజెక్టు నుండి కాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి త్రాగునీటిని బెల్లంపల్లికి సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, సింగరేణి సంస్థ పరిధిలో నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై నివేదిక అందించాలని తెలిపారు. పెన్షనాదారులకు సకాలంలో పెన్షన్ అందించాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జాబ్కార్డులు కలిగి అర్హత గల కూలీలకు పని కల్పించాలని తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన రహదారులు, వంతెనల నిర్మాణ పనులను ప్రణాళికబద్దంగా పూర్తి చేయాలని, రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించిన అనుమతులపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల ప్రకారం త్వరగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సేవ కోసమే పని చేస్తామని, పనులు చేసేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకువచ్చి పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా అధికారులు తమను సంప్రదిస్తే సంపూర్ణ మద్దతు అందించి పనులు జరిగేలా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, మందమర్రి, గోలేటి ఏరియా జనరల్ మేనేజర్లు మనోహర్, రవిప్రసాద్, తహశిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

