Telugu Updates
Logo
Natyam ad

వంట నూనెల ప్యాకింగ్ పై కేంద్రం కీలక ఆదేశాలు

ఢిల్లీ: వంట నూనెలు తయారు చేసే కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. నూనెను ప్యాక్ చేసేటప్పుడు వంట నూనె పరిమాణం, ద్రవ్యరాశినే ముద్రించాలని సూచించింది. ఆయా ఉష్ణోగ్రతల వద్ద అనే వివరాలను ఇకపై ముద్రించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉష్ణోగ్రతల పేరిట కొన్ని కంపెనీలు అక్రమాలకు పాల్పుడుతున్నాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆయిల్ తయారీ కంపెనీలకు, ప్యాకర్స్, దిగుమతిదారులకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఆయా కంపెనీలకు గడువు ఇచ్చింది. అప్పట్లోగా లేబులింగ్ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించింది. వంట నూనెలు సాధారణంగా ఒక్కో ఉష్ణోగ్రత వద్ద ఒక్కో ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇదే అదునుగా కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి. దీంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఆయిల్ నికర పరిమాణం, ద్రవ్యరాశిని మాత్రమే ముద్రించాలని ఉష్ణోగ్రతల వివరాలను ముద్రించొద్దని సూచించింది.

లీగల్ మెట్రాలజీ నిబంధనలు (ప్యాకేజ్డ్ కమొడిటీస్), 2011 ప్రకారం.. వస్తువులు తయారు చేసే కంపెనీలు వస్తువుల నికర పరిమాణం, బరువును తప్పనిసరిగా పేర్కొనాలి. వంట నూనె, వనస్పతి, నెయ్యి.. వంటి వాటి విషయాల్లో పరిమాణం పేర్కొంటే దాంతో పాటే ఆ వస్తువు బరువు కూడా వెల్లడించాలి. పరిమాణాన్ని వెల్లడించే విషయంలో పరిశ్రమలు ఉష్ణోగ్రతల వివరాలు ఎక్కువగా పేర్కొనడాన్ని తాము గుర్తించామని కేంద్రం తెలిపింది. కొన్ని కంపెనీలు ప్యాకింగ్ సమయంలో 60 డిగ్రీలుగా ఉన్నట్లు పేర్కొంటున్నాయని తెలిపింది. దీంతో వినియోగదారులు మోసాలకు గురౌతున్నట్లు కేంద్రం గుర్తించి.. తాజా ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా వంట నూనెలను 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాక్ చేయాలి. ఒకవేళ ఆయిల్ ను 21 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాక్ చేస్తే 919 గ్రాములు వస్తుంది.. అదే 60 డిగ్రీల వద్ద ప్యాక్ చేస్తే 892.6 గ్రామలుగా నమోదవుతుంది. తాజా ఆదేశాల వల్ల తూకంలో మోసాలు తగ్గి వినియోగదారులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది..