రంగారెడ్డి జిల్లా: బాలుర మధ్య రేగిన ప్రేమ వివాదంలో ఒకరు గాయాలకు గురైన ఘటన రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నారాయణ్ సింగ్ తెలిపిన వివరాలమేరకు.. బంజారాహిల్స్ ఠాణా పరిధిలో నివసించే ముగ్గురు బాలురు (17), (16), (17) ఇంటర్ చదువుతున్నారు. వారిలో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. వారిద్దరూ మరో బాలుడితో కలిసి అత్తాపూర్ లోని మూసీకాలువ వద్దకు వచ్చారు. అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంలో గొడవ జరిగింది. దీంతో ముందే ప్రణాళిక వేసుకున్న ఇద్దరు కలిసి మరో బాలుడిపై దాడికి పాల్పడ్డారు. కత్తితో పొడవబోయేసరికి బాలుడు అరవడంతో ఇద్దరూ పరారయ్యారు. సదరు బాలుడికి గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న లంగర్ హౌస్ పోలీసులు ఉస్మానియాకు తరలించారు. ఘటన జరిగిన ప్రాంతం రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోది కావడంతో వారికి సమాచారం ఇచ్చారు. వారు వివరాలు సేకరించి గొడవకు ప్రేమ వ్యవహారం కారణం అని గుర్తించారు.