Friday, July 3, 2026
HomeCrimeబెట్టింగ్ మాయలో దొంగగా మారిన ఎస్బీఐ బ్యాంక్ క్యాషియర్

బెట్టింగ్ మాయలో దొంగగా మారిన ఎస్బీఐ బ్యాంక్ క్యాషియర్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దుర్వ్యసనాలు మనుషుల జీవితాలను నాశనం చేస్తాయనడానికి మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2 శాఖలో క్యాషియర్ నగదు, ఆభరణాల తస్కరణ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఉన్నత చదువు చదివి, జాతీయ బ్యాంకులో కొలువు దక్కించుకుని, రూ. వేలల్లో జీతం పొందుతూ భార్యాపిల్లలతో సంతోషంగా జీవనం సాగించాల్సిన ఉద్యోగి ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై దొంగగా మారి కటకటాలు లెక్కించే దుస్థితికి దిగజారిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. తన అవసరాలకు దొంగగా మారడమే కాకుండా మరికొందరిని పావులుగా వాడుకుని వారినీ నిందితులుగా మార్చిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది.
చెన్నూరు ఎస్బీఐలో జరిగిన స్కాంలో ప్రధాన నిందితుడైన నరిగె రవీందర్ బాసర ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. మొదటి ప్రయత్నంలోనే ఎస్బీఐలో ఉద్యోగం సంపాదించాడు. బెట్టింగ్ కు అలవాటుపడిన అతడు 2024 అక్టోబరుకు ముందు రూ.40 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు తన వాటా వ్యవసాయ భూమిని తాకట్టుపెట్టాడు. అదే మాయలో మళ్లీ అప్పులు చేస్తుండటమే కాకుండా చివరకు తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. మేనేజర్, అటెండర్లను వ్యూహాత్మకంగా వాడుకుని తమ శాఖలో రుణగ్రహీతలు తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాలను తస్కరించడం ప్రారంభించాడు. బంధుమిత్రులు, సన్నిహితులతో వాటిని వివిధ ప్రైవేటు సంస్థల్లో రుణ తాకట్టు పెట్టించి రుణాలు పొందాడు. అందుకు సహకరించినందుకు వారికి కొంత నగదు అందజేయడంతో వారు మిన్నకుండిపోయారు. పైగా తన భార్య, వదినతో పాటు స్నేహితుల పేర్లతో 42 రుణ ఖాతాలు తెరిచాడు. అందులో 4.14 కిలోల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టకున్నా పెట్టినట్లు పత్రాలు సృష్టించి రూ.1.58 కోట్లు రుణంగా తీసుకున్నాడు. దీనికి తోడు ఏటీఎంలలో నగదు జమచేసే క్రమంలో అందులో నుంచి నగదును మాయం చేస్తూ వచ్చాడు.

Post Midle

గుడ్డిగా నమ్మించి..

సౌమ్యుడిగా, అందరితో కలివిడిగా మెదిలే క్యాషియర్ రవీందర్ బ్యాంకు వ్యవహారాల్లో తనదైన నమ్మకాన్ని చూపించేవాడు. చురుగ్గా విధులు నిర్వర్తిస్తుండటంతో ఇటు బ్యాంకు అధికారులు, సిబ్బంది, అటు ఖాతాదారులు గుడ్డిగా నమ్మేవారు. సన్నిహితులు కూడా మంచివాడని నమ్మడంతో అతడికి తన వ్యూహం అమలు చేయడం సులువుగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన క్యాషియర్ నరిగె రవీందర్, అతడితో అంటకాగిన బ్యాంకు మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, అటెండర్ లక్కాకుల సందీప్ తో పాటు 41 మంది నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. చోరీకి గురైన సొత్తులో పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడాది కాలంగా ఈ వ్యవహారం సాగుతున్నా తనకు అత్యంత నమ్మకంగా ఉన్న వారినే అందులో భాగస్వాములను చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.