Telugu Updates
Logo
Natyam ad

కొకైన్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్..?

సింగం సినిమా తరహాలో.. పోలీసుల వేట.

సైబరాబాద్: ఆపరేషన్ ‘డి’. కరడుగట్టిన మాదకద్రవ్యాల స్మగ్లర్ డానీను పట్టుకునేందుకు సింగం సినిమాలో వ్యూహం. ఇదే తరహాలో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పక్కా పథకం వేసి ఓ నైజీరియన్ ను అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ కనకయ్య ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన డానియేల్ అలియాస్ డానీ(22) విద్యార్థి వీసాపై భారత్ వచ్చాడు. కొద్దికాలం ఢిల్లీలో ఉన్నాడు. అక్కడ పరిచయమైన నైజీరియన్, మాదకద్రవ్యాల విక్రేత రిచర్డ్ సులివాన్ ద్వారా మత్తుపదార్థాలు హైదరాబాద్ లో సరఫరా చేయటం ప్రారంభించాడు. సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ బృందం నిఘా ఉంచింది. నెలక్రితం డానియేల్ నగరానికి వచ్చాడు. హైదర్జాగూడలోని సన్సిటీలో నైజీరియన్లతో ఉంటూ కొకైన్, ఎండీఎంఏ విక్రయిస్తున్నట్టు గుర్తించారు. 7 బృందాలుగా మారిన పోలీసులు శనివారం సాయంత్రం కాపు కాశారు. వారి కదలికలను గమనించిన డానియేల్ ద్విచక్ర వాహనం నుంచి కిందకు దూకి వీధుల్లో పరుగెత్తుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దాదాపు 2కిలోమీటర్ల దూరం పరుగులు తీసి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి 4 గ్రాముల కొకైన్, 10 ఎండీఎంఏ మాత్రలు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రిచర్డ్ను పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని ఢిల్లీ పంపనున్నట్టు సమాచారం. సమావేశంలో మాదాపూర్ ఎస్వోటీ ఎస్సై రాజశేఖర్ రెడ్డి, రాజేంద్రనగర్ డీఐ పవన్ తదితరులు పాల్గొన్నారు. మాదాపూర్ ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసులు చూపిన ధైర్యాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రశంసించారు.