మూడు నెలలుగా జీతాల్లేవు.. అనారోగ్యంతోనూ విధులకు హాజరు
ఎర్వచింతల్ గ్రామంలో విషాదం.. కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి
ఖానాపూర్, అక్టోబర్ 19, ( ఆంజనేయులు న్యూస్ )
గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడి మృతితో ఎర్వచింతల్ గ్రామంలో విషాదం నెలకొంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు చిట్యాల రాజన్న (57) సోమవారం విధుల్లో ఉండగా తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందాడు. సుమారు 20 ఏళ్లుగా గ్రామ పంచాయతీలో సేవలందిస్తున్న రాజన్న పారిశుధ్య పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదనే ఆవేదన ఈ ఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా జీతాలు అందకపోవడంతో రాజన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విధులకు హాజరుకావాల్సి వచ్చిందని తెలిపారు. గ్రామాల పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన రాజన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, తగిన ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నారు.
