ప్రజావాణిలో కలెక్టర్‌కు కాలనీవాసుల ఫిర్యాదు
మంచిర్యాల అక్టోబర్ 12, ఆంజనేయులు న్యూస్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీ అండాలమ్మ కాలనీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను తరలించాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు అందించారు. ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్, అక్కడ అందుబాటులో ఉన్న అడిషనల్ మున్సిపల్ కమిషనర్‌ను పిలిపించి డంపింగ్ యార్డ్ తరలింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డంపింగ్ యార్డ్ తరలింపునకు సంబంధించి అధికారులు చేపడుతున్న చర్యలను అడిషనల్ మున్సిపల్ కమిషనర్ రాజు కాలనీవాసులకు వివరించారు. నస్పూర్ వైపు సింగరేణి ఓపెన్‌కాస్ట్ సమీపంలోని సుమారు 15 ఎకరాల స్థలాన్ని డంపింగ్ యార్డ్‌కు ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆ స్థలం అటవీ భూమి పరిధిలో ఉండటంతో పాటు లీజు వ్యవహారాలు కూడా ఉన్నాయని, డీనోటిఫికేషన్ ప్రక్రియకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పట్టే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటికే ఎమ్మెల్యే సమక్షంలో మున్సిపల్, సింగరేణి, అటవీ శాఖల అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించామని, ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత శాఖల నుంచి అనుమతులు లభించిన వెంటనే డంపింగ్ యార్డ్ ను ప్రత్యామ్నాయ స్థలానికి శాశ్వతంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు..
