Tuesday, September 8, 2026
HomeTelanganaకౌమార ఆరోగ్యంపై విస్తృత అవగాహన: డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్

కౌమార ఆరోగ్యంపై విస్తృత అవగాహన: డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్

10–19 ఏళ్ల పిల్లలకు ఆరోగ్యం, మానసిక స్థైర్యం, మాదకద్రవ్యాల నివారణపై విస్తృత అవగాహన

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, సెప్టెంబరు 8, ( ఆంజనేయులు న్యూస్ )

కౌమార బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ కార్యక్రమంలో భాగంగా 10 నుంచి 19 ఏళ్ల బాలబాలికలు, పీర్‌ గ్రూప్‌ సభ్యులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో కౌమార ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కౌమార దశలో బాలబాలికలకు సరైన ఆరోగ్య సమాచారం, నమ్మకం, భరోసా, గోప్యతతో కూడిన సలహాలు అందించడం ముఖ్యమన్నారు. లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, రుతుస్రావం, గర్భనిరోధకం, ఆర్‌టీఐ, ఎస్‌టీఐలు, కౌమార సమస్యలు, గాయాలు–హింస నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రక్తహీనత, మధుమేహం, రక్తపోటు వంటి సంక్రమణేతర వ్యాధులతో పాటు మానసిక ఆరోగ్యం, కోపం, చిరాకు వంటి సమస్యలపైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. మద్యం, బీడీ, సిగరెట్లు, డ్రగ్స్, గంజాయి తదితర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యసనాలకు గురైన వారికి వాటి నుంచి బయటపడేందుకు అవసరమైన సలహాలు, సహకారం అందించాలన్నారు. పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై కూడా అవగాహన కల్పించాలన్నారు. మంచి స్పర్శ–చెడు స్పర్శపై పిల్లలకు అవగాహన కల్పిస్తూ.. అనుచితంగా ఎవరైనా తాకితే గట్టిగా “వద్దు” అని చెప్పి, అక్కడి నుంచి దూరంగా వెళ్లి, నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. అవసరమైతే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బాల్యవివాహాల వల్ల రక్తహీనత, అకాల గర్భధారణ, మాతృ–శిశు మరణాలు, నిరక్షరాస్యత, పేదరికం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. “మేము పిల్లలం.. అప్పుడే తల్లులం కాదు” అనే నినాదంతో బాల్యవివాహాల నివారణపై ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని జిల్లా మాస్ మీడియా అధికారిని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. కార్యక్రమంలో ఉప డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్‌ఓలు కాకిరాల వెంకటేశ్వర్లు, పుట్ట సత్తయ్య, శ్రీనివాస్, ఆర్‌ఎస్ పద్మ, సుమన్, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.