సికింద్రాబాద్, ఆగస్టు 22, ( ఆంజనేయులు న్యూస్ )
పాతికేళ్లుగా ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న డాక్టర్ అనిల్ మనోహర్‌లాల్ చాబ్రియా బిషప్‌గా వైభవంగా అభిషేకం పొందారు. సికింద్రాబాద్‌లోని ఆధ్యాత్మిక ప్రాంగణంలో శనివారం పవిత్ర ప్రార్థనలు, దైవిక క్రతువుల నడుమ ఈ అభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సమాజంలో అందరూ సమానమేనని, సేవాభావమే నిజమైన దైవారాధన అనే భావనతో డాక్టర్ అనిల్ చాబ్రియా గత 25 ఏళ్లుగా పేదలు, అణగారిన వర్గాలు, ఆపన్నులకు అండగా నిలుస్తూ సేవలందిస్తున్నారు. నిరుపేదల ఆకలి తీర్చడం, అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించడం, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు తోడ్పాటు అందించడం వంటి కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. సింధీ సమాజం నుంచి వచ్చిన ఆయన తెలుగు నేలపై తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా బిషప్ పదవి లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో ఆర్చ్‌బిషప్ విద్యాసాగర్, ఆర్చ్‌బిషప్ ఆర్.ఏ. పాల్, ఆర్చ్‌బిషప్ ప్రియానంద్, 64 సంవత్సరాల సుదీర్ఘ సేవానుభవం కలిగిన ఆర్చ్‌బిషప్ ఫ్రాన్సిస్ తదితర ఆధ్యాత్మిక పెద్దలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు, పవిత్ర క్రతువుల అనంతరం డాక్టర్ అనిల్ చాబ్రియాను బిషప్‌గా అభిషేకించి ఆశీర్వదించారు. “అందరినీ ప్రేమించడం – అందరికీ సేవ చేయడం” అనే సంకల్పంతో నూతన బిషప్‌గా డాక్టర్ అనిల్ చాబ్రియా మరింత విస్తృతంగా ఆధ్యాత్మిక, సామాజిక సేవలు అందించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. ఆయనకు భక్తులు, ఆధ్యాత్మిక పెద్దలు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
