గౌతమ్ నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్
నిజామాబాద్, ఆగస్టు 8, ( ఆంజనేయులు న్యూస్ )
నిజామాబాద్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్‌లో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. గౌరవనీయులైన సీపీ ఆదేశాల మేరకు, ఏసీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించడం, కాలనీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం అని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో సమావేశమైన పోలీసులు వారి సమస్యలు, భద్రతకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వారి కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇంటి యజమానులు, కిరాయిదారుల వివరాలను పోలీసులకు అందుబాటులో ఉంచాలని, కొత్తగా కాలనీకి వచ్చిన వ్యక్తుల వివరాలను కూడా పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాలనీలో నేరాల నివారణకు CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బీట్ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు పోలీస్ సేవలను చేరువ చేస్తామని తెలిపారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, యువత భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. మహిళలకు Women Help Desk, SHE Teams సేవల గురించి వివరించారు. పిల్లల భద్రత, POCSO Actపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే OTP, UPI, బ్యాంకింగ్ లావాదేవీలు తదితర సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, డ్రంక్ డ్రైవింగ్ నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఒంటరిగా నివసించే వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించిన పోలీసులు, ప్రజలు తమ సమస్యలను ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమస్యలను నమోదు చేసుకుని, వాటి పరిష్కారానికి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమవుతుందని, పోలీస్ శాఖ అందించే సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఇటువంటి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
