Wednesday, August 5, 2026
HomeTelanganaమంచిర్యాలలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల అవగాహన కార్యక్రమం

మంచిర్యాలలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, ఆగస్టు 4, ( ఆంజనేయులు న్యూస్ )

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీలలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, జిల్లా సంక్షేమ శాఖ, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాలింతలు, గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ “తల్లిపాలే శిశువుకు తొలి టీకా, తొలి ఆహారం, తొలి ప్రేమ” అని పేర్కొన్నారు. తల్లిపాలు శిశువుకు రక్షణ, పోషణ, శారీరక-మానసిక ఎదుగుదలతో పాటు తల్లి-శిశువు మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ప్రారంభించాలని, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆరు నెలల తర్వాత పౌష్టికాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. బాటిల్ పాలు, పాలపొడి అలవాటు చేయవద్దని, శిశువుకు అవసరమైన ప్రతిసారి తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన అన్ని పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు, జ్వరం, డయేరియా వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయని తెలిపారు. అలాగే శిశువు మేధో వికాసం, శారీరక ఎదుగుదలకు తల్లిపాలు కీలకమని పేర్కొన్నారు. తల్లులకు కూడా తల్లిపాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ప్రసవానంతరం త్వరగా కోలుకోవడానికి, రక్తహీనత తగ్గడానికి, తల్లి-శిశువు మధ్య ప్రేమానుబంధం బలపడడానికి, రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో తల్లిపాలు దోహదపడతాయని వివరించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని నవజాత శిశు విభాగాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ ద్వారా రోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ శ్రీధర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ సుప్రణ, డాక్టర్ సతీష్, జిల్లా సంక్షేమ అధికారి రఫ్ ఖాన్, సీడీపీఓలు, అంగన్‌వాడీ సూపర్వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, నర్సింగ్ అధికారులు, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల అధ్యక్షుడు పి. వెంకటేశ్వర్లు, కార్యదర్శి టి. శ్రీనివాస్, ఏ. వెంకటేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్‌వోలు అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, పుట్ట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలు, తల్లులకు అరటిపండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.