Sunday, July 26, 2026
HomeTelanganaసీతారాంపల్లిలో ఆరోగ్య శిబిరం – క్షయ, బీపీ, షుగర్ పరీక్షలతో ప్రజలకు సేవలు

సీతారాంపల్లిలో ఆరోగ్య శిబిరం – క్షయ, బీపీ, షుగర్ పరీక్షలతో ప్రజలకు సేవలు

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

డీఎంహెచ్‌వో డా. నరేందర్ రాథోడ్

మంచిర్యాల, జూలై 24, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల పురపాలక పరిధిలోని నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సీతారాంపల్లి రైతు వేదికలో శుక్రవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ నరేందర్ రాథోడ్ సందర్శించి వైద్య సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఫోర్టబుల్ మొబైల్ ఎక్స్‌రే యంత్రం ద్వారా శిబిరానికి వచ్చిన వారికి ఛాతీ ఎక్స్‌రేలు తీసి, అవసరమైన కఫ పరీక్షలు నిర్వహించి క్షయవ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించారు. జాతీయ అసంక్రమణ వ్యాధుల (NCD) కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారికి రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేశారు. అలాగే వారి వివరాలను నిశ్చయ్ పోర్టల్‌లో నమోదు చేసి వ్యాధులపై అవగాహన కల్పించారు. క్షయవ్యాధిగ్రస్తులకు ఎన్జీవోల సహకారంతో పోషకాహార కిట్లను అందించాలని డీఎంహెచ్‌వో సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామంలో ప్రతి వారం డ్రై డే నిర్వహించాలని ఆదేశించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం, వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించడం, వేడి ఆహారం మాత్రమే తీసుకోవడం, రోడ్లపై విక్రయించే ఆహార పదార్థాలను తీసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను శిబిరం ద్వారా ప్రజలకు అందించడంతో పాటు మాతా–శిశు సంరక్షణ సేవలు, టీకాల కార్యక్రమం, 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. అలాగే క్షయవ్యాధి, కీటక జనిత వ్యాధుల లక్షణాలను గుర్తించి చికిత్స పొందేలా ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రషీద్, స్థానిక కార్పొరేటర్ సిరిమల సౌమ్య, వైద్యాధికారులు డాక్టర్ వెంకటేష్, డాక్టర్ ప్రియాంక సలోని, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాందేవ్, టీబీ పర్యవేక్షకులు సాయిరెడ్డి, రాజేష్, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో మొత్తం 123 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.