మంచిర్యాల, జూలై 22, ( ఆంజనేయులు న్యూస్ )
జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవం (National Flag Adoption Day) సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G, రీజన్–7 ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఉదారి చంద్రమోహన్, కార్యక్రమ చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా రీజన్ చైర్పర్సన్ లయన్ చక్రధర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 1947 జూలై 22న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని భారత రాజ్యాంగ సభ అధికారికంగా జాతీయ పతాకంగా ఆమోదించిందని గుర్తు చేశారు. ఆ చారిత్రక దినాన్ని ప్రతి సంవత్సరం జాతీయ పండుగలా నిర్వహిస్తూ, జాతీయ పతాకం ప్రాముఖ్యతను ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం సభ్యులు చేతుల్లో త్రివర్ణ పతాకాలతో జాతీయ గీతాలను ఆలపిస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఐబీ చౌరస్తా వరకు దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ లయన్ దొంతుల ముఖేష్, లయన్ రాజేష్, రీజన్ పరిధిలోని పది లయన్స్ క్లబ్బుల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రభుత్వ దత్తత పాఠశాల సాయికుంటలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులతో త్రివర్ణ పతాకాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఫాతిమా, ఉపాధ్యాయుడు సాంబయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ వినయ్ కుమార్, ఇరుకుల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
