జర పట్టించుకోండి సారు” అంటూ కాలనీ వాసుల ఆవేదన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య తీవ్రరూపం దాల్చింది. కాలువల్లో నిల్వైన మురుగు నీరు రోడ్లపైకి పొంగిపొర్లడంతో ప్రజలు రోజువారీ జీవనంలో తీవ్ర అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. రహదారులు మురికి నీటితో నిండిపోవడంతో చెడు వాసన వ్యాపించి పరిసరాలు అసహ్యంగా మారాయి. ఈ పరిస్థితుల్లో కాలనీ ప్రజలు, వాహనదారులు జారిపడే ప్రమాదంతో భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా దోమల విస్తరణ పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. “జర పట్టించుకోండి సారు…” అంటూ తమ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
