Monday, August 17, 2026
HomeTelanganaమంచిర్యాల జిల్లాలో డయాలసిస్ కేంద్రాల విస్తరణకు చర్యలు

మంచిర్యాల జిల్లాలో డయాలసిస్ కేంద్రాల విస్తరణకు చర్యలు

📰 Generate e-Paper Clip

పలు ఆసుపత్రుల్లో కొత్త బెడ్స్ ఏర్పాటు – త్రీ మెన్ కమిటీ పరిశీలన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లాలో డయాలసిస్ సేవలను విస్తరించేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న డయాలసిస్ కేంద్రాలు మరియు ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో అదనపు బెడ్స్ ఏర్పాటుకు జిల్లా స్థాయి త్రీ మెన్ కమిటీ పరిశీలనలు చేపట్టింది. ఈ క్రమంలో లక్షెట్టిపేట, వేమనపల్లి, భీమిని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి కేంద్రానికి ఐదు డయాలసిస్ బెడ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో రెండు అదనపు డయాలసిస్ బెడ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏర్పాట్ల సాధ్యతపై అధ్యయనం చేయడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్. అనిత, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్ అప్పల ప్రసాద్, డిపిఓ ప్రశాంతి, నర్సింగ్ అధికారులు కలిసి లక్షెట్టిపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మరో బృందం భీమిని, వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించింది. పరిశీలనలో భాగంగా ఆయా కేంద్రాల్లో వైద్యులు, ఫిజీషియన్, అనస్తీషియా నిపుణులు అందుబాటులో ఉన్నారా, డయాలసిస్ సేవల కోసం అవసరమైన స్థలం, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా పరీక్షల సదుపాయం, నీటి సరఫరా, ఇన్‌పేషెంట్ రోగుల బంధువులకు సౌకర్యాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సమీక్ష అనంతరం త్రీ మెన్ కమిటీ తమ నివేదికను జిల్లా కలెక్టర్‌కు, అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌కు పంపనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ రోగులకు వైద్యం మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ చర్యల ద్వారా జిల్లాలో డయాలసిస్ సేవలు విస్తరించి, రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.