డ్రగ్స్, సైబర్ క్రైమ్స్, పోక్సో చట్టాలపై విద్యార్థులకు కీలక సూచనలు
అపరాధాలపై వెంటనే 100 లేదా 6303923700కు ఫిర్యాదు చేయాలని సూచన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మహిళలు, బాలికల భద్రత కోసం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని జిల్లా షీ టీం ఇంచార్జి ఎస్‌ఐ ఉషారాణి పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలోని పీ ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ మరియు షీ టీమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ, డ్రగ్స్ వలన కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం, చట్టపరమైన శిక్షల గురించి విద్యార్థులకు వివరించారు. జిల్లాలో పనిచేస్తున్న షీ టీమ్స్ ప్రాముఖ్యత, మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్, ఉద్దేశపూర్వకంగా వెంబడించడం వంటి ఘటనలపై తీసుకునే చర్యలను తెలియజేశారు. మానవ అక్రమ రవాణా, పోక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ (జెజె) యాక్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం, మోటార్ వెహికల్ యాక్ట్ వంటి చట్టాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, సైబర్ నేరాల నుంచి రక్షణ, సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 ప్రాముఖ్యతను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. డ్రగ్స్ సేవించడం, మహిళలను వేధించడం, రోడ్డుపై అవహేళనగా మాట్లాడడం, ఉద్దేశపూర్వకంగా వెంటపడడం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే 100 లేదా రామగుండం షీ టీమ్ నెంబర్ 6303923700కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ కానిస్టేబుల్స్ శ్రవణ్, జ్యోతి, పాఠశాల హెడ్‌మాస్టర్ ప్రదీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
