Monday, August 17, 2026
HomeCrimeమృత్యువుతో పోరాడి ఓడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

మృత్యువుతో పోరాడి ఓడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

📰 Generate e-Paper Clip

 

అది ఒక ప్రమాదమే కాదు. నేరం అంతకన్నా కాదు. రాక్షస ప్రవృత్తి మరిగిన మత్తు లోకానికి, నిజాయతీ అనే చొక్కా తొడిగిన ఖాకీకి మధ్య జరిగిన అసమాన పోరాటం. కేవలం కొన్ని కిలోల గంజాయి కోసం పొరుగు రాష్ట్రానికి చెందిన ముఠా బరితెగించింది. ఓ నిండు ప్రాణాన్ని కారు టైర్ల కింద కర్కశంగా నలిపేసింది. సమాజంలోని మానవత్వం తలదించుకునేలా చేసింది. డబ్బు, మత్తు కళ్లను కప్పేస్తే.. ఎదురుగా నిల్చున్నది ఒక మనిషిలా కాకుండా.. ఓ అడ్డంకిలా మాత్రమే కనిపిస్తుందనడానికి నిజామాబాద్ లో ఇటీవల చోటుచేసుకున్న అమానవీయ ఘటనే ప్రబలసాక్ష్యం.

ఆంజనేయులు న్యూస్, నిజామాబాద్ జిల్లా: ఎస్సై కావాలని కలలు కన్న మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) సొంతూరు జిల్లాలోని మెస్రా మండల కేంద్రం. పేద దంపతులైన సాయిలు-చంద్రకళల ఒక్కగానొక్క కుమార్తె. డిగ్రీ పూర్తికాగానే 2024లో తొలి ప్రయత్నంలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఆమె తమ్ముడు శ్రావణ్ డిగ్రీ పూర్తవగా, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. సంతలో మసాలాలు విక్రయిస్తూ తనను ఉన్నత చదువులు చదివించిన కన్నవాళ్ల కలలను నెరవేర్చేందుకు సౌమ్య ఎంతో శ్రమించారు. ఆమె కూడా ఎస్సై కొలువే లక్ష్యంగా సాధన కొనసాగించారు. తొలిమెట్టుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టు సాధించి నిజామాబాద్ లో ఏడాది క్రితం విధులు చేపట్టారు. కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో జనవరి 23వ తేదీన ఎక్సైజ్ సీ ఐ స్వప్న బృందంతో పాటే సౌమ్య తనిఖీలకు వెళ్లారు. నిజామాబాద్ శివారు మాధవనగర్ వద్ద సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కారును ఆపినట్టే ఆపిన గంజాయి ముఠా..

ఒక్కసారిగా సౌమ్యను తొక్కించుకుని ముందుకెళ్లింది అదుపుతప్పిన వాహనాన్ని చుట్టుముట్టిన అధికారులు మైనర్ తో పాటు మరో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళా కానిస్టేబుల్ను నిజామాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించగా.. వైద్యులు శస్త్రచికిత్స చేసి దెబ్బతిన్న కిడ్నీని తొలగించారు. రెండ్రోజుల తర్వాత ఆమెను ఉన్నతాధికారులు హైదరాబాద్లోని నిమ్స్ కు తరలించారు. వైద్య ఖర్చులకు ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు బాధితురాలి కుటుంబీకులను పరామర్శించారు. ఈనెల 2న సీఎం రేవంత్రెడ్డి పరామర్శకు రావాల్సి ఉండగా.. ఇంతలోనే మృత్యువుతో పోరాడుతూ సౌమ్య శనివారం రాత్రి ప్రాణాలు విడిచారు.

సౌమ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగారు. ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగులు కన్నీటి నివాళులర్పించారు. ఆదివారం స్వగ్రామంలో సౌమ్య అంత్యక్రియలు జరిపించనున్నట్లు బంధువులు తెలిపారు. ‘గంజాయి మహమ్మారి సమాజంలో ఇంకెత లోతుగా వెళ్లూనుకుంటుంది? అది మరెందరి మనుషులను మృగాలుగా మారుస్తుంది’ అని ఆగిపోయిన సౌమ్య ఊపిరి రక్తాక్షరాలతో ప్రశ్నిస్తోంది కర్కశ ముఠాలపై ఉక్కుపాదం మోపితేనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరుతుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.