Thursday, July 2, 2026
HomeTelanganaమంచిర్యాల-అంతర్గాం వంతెన స్థలం మార్పు?

మంచిర్యాల-అంతర్గాం వంతెన స్థలం మార్పు?

– తగ్గనున్న దూరభారం

– ఆందోళనల మధ్య వంతెన మంజూరు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల-అంతర్గాం మధ్య గోదావరిపై వంతెన నిర్మాణండోలాయమానంలో పడింది. గోదావరిపై వంతెన నిర్మించాల్సిన ప్రాంతంలో ఆర్‌అండ్‌బీ అధికారులు సర్వే జరిపి సాయిల్‌ టెస్టింగ్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. 2018లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శ్రీరాంపూర్‌ బహిరంగ సభకు హాజరైన అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్‌ హామీలో భాగంగా వంతెన నిర్మాణానికి మోక్షం లభించింది. మొదట రూ.125 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం అనంతరం దానిని రూ.165 కోట్లకు పెంచుతూ జీవో జారీ చేసింది. వంతెన నిర్మాణం పూర్తయితే మంచిర్యాల-పెద్దపల్లి జిల్లాల మధ్య దూరభారం తగ్గనుంది. కరీంనగర్‌ వైపు వెళ్లేందుకు గోదావరిఖని మీదుగా ప్రయాణించాల్సి రావడంతో ప్రయాణికులకు తలెత్తున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

• తగ్గనున్న దూరభారం.

Post Midle

మంచిర్యాల వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణం పూర్తయితే గరిష్టంగా దూరం తగ్గనుంది. రెండు జిల్లాల మధ్య కనీసం 40 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం కరీంనగర్‌, హైదరాబాద్‌ లాంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే గోదావరిఖని మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మంచిర్యాల-శ్రీరాంపూర్‌- గోదావరిఖని వరకు వెళ్లేందుకు అధిక రవాణా భారం, ట్రాఫిక్‌ కారణంగా కనీసం 45 నిమిషాలు అదనంగా సమయం వెచ్చించాల్సి వస్తుంది. వంతెన నిర్మాణం పూర్తయితే మంచిర్యాల నుంచి నేరుగా బసంత్‌నగర్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌లకు చేరుకునే వెసలుబాటు ఉంటుంది.

• ఆందోళనల మధ్య వంతెన మంజూరు.

గోదావరిపై వంతెన నిర్మిస్తామని కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రజలు ఆందోళన బాట పట్టారు. గోదావరి వంతెన సాధన సమితి పేరుతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు వంతెన నిర్మాణానికి చొరవ చూపారు. వంతెన నిర్మాణం ఆవశ్యకతపై పలుమార్లు ఆయన ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. జిల్లా కేంద్రంలో గోదావరి వంతెన సాధన సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆందోళనలు ఉధృతమవుతున్న తరుణంలో ఎట్టకేలకు వంతెనను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది.

• స్థల మార్పిడి యోచనలో.

గోదావరిపై రెండు జిల్లాల నడుమ వంతెన నిర్మాణం ప్రజల చిరకాల కోరిక కావడంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వంతెన కోసం గతంలో ప్రతిపాదించిన స్థలం కాకుండా మరో చోటికి మార్పు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ముందుగా ప్రతిపాదించనట్లు జిల్లా కేంద్రంలోని కాలేజ్‌ రోడ్డు గౌతమేశ్వరాలయం వద్ద కాకుండా, హాజీపూర్‌ మండలం ముల్కల్ల వద్ద గోదావరిపై వంతెన నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గౌతమేశ్వరాలయం వద్ద వంతెన నిర్మిస్తే పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్‌ పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నందున ముల్కల్ల వద్ద నిర్మాణం చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. శుభకార్యాలు, కర్మకాండల కోసం పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో గోదావరి స్నానాలపై ఆధారపడతారు. ముఖ్యంగా పండుగలు, పర్వదినాల్లో కాలేజీ రోడ్డులో రద్దీ ఉంటుంది. అక్కడ బ్రిడ్జి నిర్మిస్తే మరింతగా సమస్యలు తప్పవనే భావనతో స్థలం మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ముల్కల్ల వద్ద గోదావరిపై వంతెన నిర్మాణం చేపడితే పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. కాగా వంతెన నిర్మాణం ఎక్కడ చేపట్టినా త్వరితగతిన పనులు ప్రారంభించేటట్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.