Wednesday, August 19, 2026
HomeTelanganaకార్మిక శాఖలో అవినీతి బాగోతం

కార్మిక శాఖలో అవినీతి బాగోతం

📰 Generate e-Paper Clip

జిల్లా కార్మిక శాఖలో అవినీతి కంపు కొడుతోంది. రోజూ వారీ కూలీలకు అందే పథకాలు, పరిహారంలో పైసలు ఇవ్వనిదే పని కావడం లేదు. దీనికితోడు నకిలీ కార్మిక కార్డులు సృష్టించి.. అర్హులకు అన్యాయం చేస్తున్నారు.

కాగజ్నగర్ మండలం చింతగూడకు చెందిన బొర్కుట్ తిరుపతి పేరిట ఉన్న నకిలీ గుర్తింపు కార్డు

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కార్మిక శాఖలో అవినీతి కంపు కొడుతోంది. రోజూ వారీ కూలీలకు అందే పథకాలు, పరిహారంలో పైసలు ఇవ్వనిదే పని కావడం లేదు. దీనికితోడు నకిలీ కార్మిక కార్డులు సృష్టించి.. అర్హులకు అన్యాయం చేస్తున్నారు. కూలీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకుంటున్న ఘటనలు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూశాయి. బెజ్జూరులో ఓ కార్మికుడు కార్డు రెన్యూవల్ కోసం వెళితే.. అతడు రికార్డులో చనిపోయినట్లుగా చూపి పరిహారం కాజేసిన విషయం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి ఘటనలు జిల్లావ్యాప్తంగా ఉండటం గమనార్హం.
రెక్కలు ముక్కలు చేసుకుని, రాత్రీ పగలు కష్టపడే కూలీలు.. భవన నిర్మాణ కార్మికులకు ఆపద సమయంలో ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. వీటిని పకడ్బందీగా అమలు చేసి.. పర్యవేక్షించాల్సిన సంబంధితశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వివాహ సమయంలో వచ్చే ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రమాద సమయంలో చికిత్సల నిమిత్తం విడుదలయ్యే నిధుల్లోనూ కమీషన్ ఇస్తేనే పని అవుతోంది. అది కూడా అరకొరే. మరోవైపు అర్హులు, అవసరమైన పత్రాలు అన్నీ సమర్పించిన వ్యక్తులకు సంబంధించి బీమా, వివాహ ప్రోత్సాహం విడుదల కావడంలో తీవ్ర జాప్యం నెలకొంటుంది.

• కార్డుకు రూ.3 వేల వరకు వసూలు..

జిల్లావ్యాప్తంగా 32 వేల మంది కార్మికులున్నారు. కాగజ్ నగర్ లోని కార్మికశాఖ కార్యాలయంలో వీరందరూ ప్రతీ అయిదేళ్లకోసారి తమ పేర్లను నమోదు. చేసుకోవాలి. అందుకు మీసేవలో రూ.120 చలాన్ తీసి వివరాలు సమర్పించాలి. అనంతరం సంబంధిత అధికారులు కార్డులు అందిస్తారు. ఈ కార్డుల జారీ నుంచే అక్రమాలకు బీజం పడుతోంది. నకిలీ కార్డులు రూపొందించడంతో పాటు, ఒక్కో కార్డు జారీ చేయడానికి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. కార్మికుల సంతానం వివాహ సమయంలో వచ్చే రూ.30 వేలలోనూ, ప్రమాదాల్లో గాయాలైతే ఇచ్చే రూ.1.30 లక్షలోనూ వాటాల యావే కనిపిస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా కొందరు అధికారులు ఒప్పంద ఉద్యోగుల అధ్వర్యంలో ఈ తతంగం జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

• రూ.కోట్లు పక్కదారి..

వాంకిడి మండలంలోని వ్యక్తి, కోయవాగుకు చెందిన మరో కార్మికుడు 2016లో చనిపోతే 2021లో చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి బీమా సొమ్ము “పంచుకున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ధ్రువపత్రాలు ఇచ్చినందుకు బాధిత కుటుంబానికి రూ. లక్ష, లక్ష ఇచ్చి.. మిగతాదంతా సదరు అధికారులే తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇలా సంవత్సరకాలంలోనే 40 నుంచి 50 మంది వరకు అంటే రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని విశ్వసనీయ సమాచారం. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు దొంగలు బయటపడుతారని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.


విచారణ చేస్తాం..
 – వినీత, అసిస్టెంట్ కమిషనర్, మంచిర్యాల

కార్మికులకు అందించే ఆర్థికసాయం విషయంలో వస్తున్న ఆరోపణలపై విచారణ చేస్తాం. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అర్హులకు తప్పకుండా న్యాయం చేస్తాం..

• మూడేళ్ల నుంచి తిరుగుతున్నా..

-నర్మద, కాగజ్నగర్

2020లో నా భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కార్మిక శాఖ కార్యాలయంలో అన్ని రకాల ధ్రువపత్రాలు సమర్పించినా నేటికీ ఆర్థిక సాయం అందలేదు. ఇప్పటికైనా అధికారులు నాకు న్యాయం చేయాలి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.