తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి గళం తార స్థాయికి చేరిన వేళ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎల్పీ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడితో సహా పలువురు సీనియర్ నాయకులు రేవంత్ పై చేసిన విమర్శలను మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తిప్పికొట్టారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి నేతలపై మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి బలహీనపర్చే కుట్ర జరుగుతోందన్నారు. ఈనెల 26 నుంచి పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుంటే.. పాదయాత్రను దెబ్బతీయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ముసుగువీరులు ఇప్పుడు బయటకు వచ్చారన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు సేవ్ కాంగ్రెస్ ఎందుకు గుర్తు రాలేదు? ఆనాడు పీసీసీగా ఉన్నవాళ్లు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఉత్తమ్ ఏం చేశారని అనిల్ ప్రశ్నించారు. సీనియర్లు పార్టీకోసం పనిచేస్తే మునుగోడులో 50వేల ఓట్లతో గెలిచే వాళ్లమని పేర్కొన్నారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి జరిగితే సీనియర్లు ఎక్కడికి పోయారని నిలదీశారు. మీ లోపాయికారీ ఒప్పందం భాజపాతోనా లేక బీఆర్ఎస్ తో నా? అని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వార్థం కోసం తెదేపాతో పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించిన అనిల్.. ఈరోజు తెదేపా నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఎందుకని తిడతారా? ఇది మీకు న్యాయమా అంటూ ఉత్తమ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎల్పీనేత భట్టికి కమిటీల సమాచారం లేదనేది అసత్యమన్నారు. “సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు.. పార్టీ నేతలపై ఆయన ఎందుకు పోస్టులు పెడతారు? ఉత్తమ్ పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్టు ఆధారాలు ఉన్నాయా? సీపీ సీవీ ఆనంద్ ఎలా చెబుతారు.. దాన్ని మీరెలా నమ్ముతారు?” అని అనిల్ ప్రశ్నించారు.

