Tuesday, August 18, 2026
HomeTelanganaశంకుస్థాపనలకే పరిమితం కాలేదు.. పూర్తి చేసి చూపించాం: ప్రధాని మోదీ

శంకుస్థాపనలకే పరిమితం కాలేదు.. పూర్తి చేసి చూపించాం: ప్రధాని మోదీ

📰 Generate e-Paper Clip

భవిష్యత్ లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్..

సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదు”

ప్రధానమంత్రి నరేంద్రమోదీ

ఆంజనేయులు న్యూస్, రామగుండం: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్ఎఫ్సీఎల్ సందర్శన అనంతరం ఎన్టీపీసీ టౌన్ షిప్ ని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరువుల కర్మాగారాన్ని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్ -సిద్దిపేట- ఎల్కతుర్తి హైవే విస్తరణ పనులు, బోధన్-బాసర-భైంసా హైవే పనులకు, సిరొంచా – మహాదేవ్పూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

భవిష్యత్ లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్..

అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడుతూ… ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వేలైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభించాయన్నారు. “కొత్త ప్రాజెక్టులతో జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 8 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చాం. అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచాం. మేం శంకుస్థాపనలకే పరిమితం కాలేదు, వాటిని వేగంగా పూర్తి చేసి చూపించాం. రామగుండం ఎరువుల కర్మాగారానికి 2016లో శంకుస్థాపన చేశాం. కర్మాగారాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయినా.. రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టాం. 5 ప్రాంతాల్లోని ఎరువుల కర్మాగారాల్లో 70లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతోంది. తక్కువ ధరకే రైతులకు నీమ్ కోటింగ్ యూరియా అందిస్తున్నాం. నానో యూరియా టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి తెచ్చాం. 2014కంటే ముందు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవాళ్లు. మేం అధికారంలోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చూశాం. భవిష్యత్ లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుంది. మేం తీసుకున్న చర్యలతో యూరియా నల్లబజారు మార్కెట్ బంద్ అయ్యింది. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు అందిస్తున్నాం. నేల స్వభావాన్ని బట్టి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు చేపట్టాం.

సింగరేణి విషయంలో కొందరు అబద్ధాలు చెబుతున్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది. మెజార్టీ వాటా రాష్ట్రానిది అయితే కేంద్రం ఎలా విక్రయిస్తుంది. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదు” అని మోదీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.