పోలీసులు అందిస్తున్న సేవలు, చేసిన త్యాగాలను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పోలీసులు అందిస్తున్న సేవలు, చేసిన త్యాగాలను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లాలోని గుడిపేట 13వ పటాలములో నిర్వహించిన 63వ పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరై పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 21, 1959లో 20 మంది జవాన్లు లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ చేసిన దాడిలో 10 మంది జవాన్లను కోల్పోయామని, నాటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందని తెలిపారు. రక్షణ అంటే గుర్తొచేది పోలీస్ అని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎండ, వాన, పగలు, రాత్రి అని తేడా లేకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల కోసం విధులు నిర్వహిస్తుంటారని తెలిపారు. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో అమరులైన పోలీసుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయని, ప్రజాసేవ, ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు పునరంకితయ్యే స్ఫూర్తినిస్తాయని తెలిపారు. 
విచ్ఛిన్నకర, అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాటాలతో పోలీసులు ప్రమాదకర విధులు నిర్వహిస్తారని, సమయం, ప్రాంతం ఆలోచించకుండా సంఘటన జరిగితే ముందుంటారని తెలిపారు. పోలీసులు త్యాగం చేయని రోజు ఉండదని, పండుగలు, సంబరాలతో సంబంధం లేకుండా, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అవిశ్రాంతంగా పని చేస్తారని తెలిపారు. వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాల సంక్షేమంతో పాటు మానసిక బలాన్ని అందించడం మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ ఎం. రామకృష్ణ, అదనపు కమాండెంట్ ఎం.ఐ. సురేష్, సహాయ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్, యూనిట్ మెడికట్ అధికారి డా॥ సంతోష్, ఆర్.ఐ.లు, ఆర్.ఎస్.ఐ.లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

