
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: టి.ఎస్.పి.ఎస్.సి. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేదీన జరుగనున్న పరీక్ష నిర్వహణ కొరకు జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం. జరిగిందని, జిల్లాలో 9 వేల 243 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూమ్ నం. 08736-250501ను, ఆర్.టి.సి. ప్రయాణ ప్రాంగణంలో హెల్ప్ డెస్క్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వివరాల కొరకు సంప్రదించవచ్చని తెలిపారు. బెల్లంపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, టి.ఎస్.డబ్ల్యు.ఆర్.ఎస్.జె.సి. (బాలికలు), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలల్లో, మంచిర్యాలలోని ట్రినిటి హైస్కూల్, శ్రీహర్ష డిగ్రీ కళాశాల, కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్, శ్రీ ఉషోదయ హైస్కూల్, వివేకవర్ధిని డిగ్రీ కళాశాల, మిమ్స్ డిగ్రీ కళాశాల, సెవెన్ హిల్స్ హైస్కూల్ పాఠశాల, మిమ్స్ జూనియర్ కళాశాల, మిమ్స్ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్రీ చైతన్య హైస్కూల్, అల్ఫోర్స్ జూనియర్ కళాశాల, రిమ్స్ (ప్రేరణ) డిగ్రీ కళాశాల, చాణక్య డిగ్రీ కళాశాల, ఆర్.బి. హెచ్.వి. హైస్కూల్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల, సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఉదయం 8.30 గం||లకు బయోమెట్రిక్ అటెండెన్స్ మొదలవుతుందని, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని, ఉదయం 10.15 గం.ల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయబడతాయని, ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతించడం జరగదని, పరీక్షా కేంద్రంలోకి పరీక్ష ప్యాడ్లు, బ్యాగులు, సెల్ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, వాచ్లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని, అభ్యర్థులు షూస్ ధరించరాదని, చెప్పులతో మాత్రమే హాజరు కావాలని తెలిపారు. అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్ టికెట్, పెన్ మాత్రమే తీసుకురావాలని, హాల్టికెట్తో పాటు ఒరిజినల్ ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు / పాన్కార్డు / ఓటర్ ఐ.డి./ ఎంప్లాయి ఐ.డి. / డ్రైవింగ్ లైసెన్స్ / పాస్పోర్ట్ తప్పనిసరిగా తీసుకురావాలని, అభ్యర్థులు తమ హాలికెట్పై అన్ని వివరాలను సరిచూసుకోవాలని, హాల్టికెట్పై ఫొటో, సంతకం ముద్రించబడి లేనట్లయితే గజెటెడ్ అధికారిచే 3 ఫొటోలు అటెస్ట్ చేయించుకొని, తగు ధృవీకరణతో ఇన్విజిలేటర్కు అందజేయాలని, లేనిచో పరీక్షకు అనుమతించబడరని తెలిపారు. పరీక్ష ప్రవేశ ద్వారం వద్ద హాల్టికెట్, ప్రూఫ్లు పరిశీలించిన తర్వాత, బయోమెట్రిక్ అటెండెన్స్ (వేలిముద్రలు) తీసుకోవడం జరుగుతుందని, ప్రాథమిక పరీక్షకు బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు ఉన్నందున మెహందీ, టాటూలు ఉండకూడదని, అభ్యర్థులు తమ రూమ్ నెంబర్, సంబంధిత సీట్ చేరుకొని టెస్ట్ బుక్ లెట్ నంబరును పరిశీలించుకోవాలని, టెస్ట్ బుక్ లెట్ నంబరును ఓ.ఎమ్.ఆర్. ఆస్సర్ షీట్ పై వ్రాసి, తగు రీతిలో బబ్లింగ్ చేయాలని, అభ్యర్థులు సమాధానాలకు నీలి / నలుపు రంగు బాల్ పాయింట్ పెస్తో మాత్రమే ఉపయోగించాలని, ప్రశ్నపత్రంపై సమాధానాల ఎంపికను ఎట్టి పరిస్థితిలో రాయకూడదని తెలిపారు. ఓ.ఎమ్.ఆర్. కార్డ్స్,పై చాక్ పీస్ పౌడర్, బ్లేడింగ్, వైట్ నర్లను వినియోగించకూదని, వాడినట్లయితే సమాధాన పత్రాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారని, పరీక్ష వేళలు ముగిసే వరకు అభ్యర్థులు హాల్లోనే ఉండాలని, పరీక్ష ప్రారంభమయ్యాక అభ్యర్థులకు అర్థమయ్యే రీతిలో గంటకొకసారి బిగ్గరగా “బెల్” మ్రోగించడం జరుగుతుందని, ఇన్విజిలేటర్ అభ్యర్థులకు ప్రకటిస్తుంటారని, పరీక్ష ముగిసిన తర్వాత అందరి వద్ద నుండి ఓ.ఎమ్. ఆర్. కార్డ్స్ తీసుకున్న తరువాత, అందరి బయోమెట్రిక్ అటెండన్స్ పూర్తయిన తరువాత అభ్యర్థులను ఒకేసారి బయటకు పంపిస్తారని తెలిపారు.
