Wednesday, August 19, 2026
HomeCrimeమహిళపై బీరు సీసాతో తెరాస నేత దాడి.. రాజకీయ వేడి

మహిళపై బీరు సీసాతో తెరాస నేత దాడి.. రాజకీయ వేడి

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, పంజాగుట్ట, బోరబండ: అర్ధరాత్రి దాటాక ఇంట్లోకి ప్రవేశించిన ఓ తెరాస నాయకుడు  మహిళపై బీరు సీసాతో దాడి చేయటం కలకలం రేపింది. నిందితుడు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావటంతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. నాటకీయ ఫక్కీలో జరిగిన ఘటన వెనుక కారణాలను వెలికితీసేందుకు పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగారు.
ఖైరతాబాద్ పరిధిలోని ఎం.ఎస్. మక్తాలో నిషాగౌడ్(31) భర్తతో కలిసి నివసిస్తున్నారు. ఏడాది క్రితం ఆమెకు ఫేస్ బుక్ లో పరిచయమైన బోరబండ డివిజన్ తెరాస సమన్వయకర్త విజయసింహారెడ్డి(33) తో ఫోన్ లో ఛాటింగ్ చేస్తుండేవారు. భర్తలేని సమయంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఆమె ఇంటికెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. మాటామాటా పెరగటంతో పట్టరాని కోపంతో అతడు బీరుసీసా పగులగొట్టి ఆమె గొంతు కోసి పారిపోయాడు. డయల్ 100కు అందిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరారు. క్షతగాత్రురాలిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తనపై విజయసింహ రెడ్డి దాడి చేసినట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రతిపక్షాల ఆందోళన

• ‘నిందితుణ్ని అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ భాజపా నేతలు సోమవారం పంజాగుట్ట ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు. భాజపా ఖైరతాబాద్ ఇన్ఛార్జి పల్లపు గోవర్ధన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌతంరావు కార్యకర్తలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.

• నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వరలక్ష్మి కార్యకర్తలతో నిరసనకు దిగారు.

కుట్ర చేసి ఇరికించారు..

• మహిళపై దాడి జరిగిన సమయంలో తాను వినాయకనగర్ లోని తన ఇంట్లో ఉన్నట్లు విజయసింహా రెడ్డి మీడియాతో చెప్పారు. బోరబండ కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ కుట్రపూరితంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.

• తనపై విజయసింహారెడ్డి చేసినవన్నీ నిరాధార ఆరోపణలని కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఖండించారు.

• ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక నిషా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పోలీస్ శాఖపై తనకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే భాజపా నాయకులను కలిసి న్యాయం చేయమని అడుగుతానని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.