Monday, August 17, 2026
HomeTelanganaప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

మంచిర్యాల జిల్లా: జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ ఇన్చార్జ్ వైద్యాధికారి డా॥ నీరజతో కలిసి వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ఆసుపత్రులలో గర్భిణులకు సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యాధికారులు దృష్టి సారించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భం దాల్చిన మహిళలు తమ వివరాలను నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా అవసరమైన పరీక్షలు జరుపుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఇంటి వద్ద ప్రసవాలు జరుగకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లాలోని తాళ్ళగురిజాల, తాండూర్, హాజీపూర్, పాతమంచిర్యాల, రాజీవ్ నగర్, కుందారం, వేమనపల్లి, అంగరాజ్పల్లి, వెంకట్రావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణుల వివరాల నమోదు, పరీక్షల నిర్వహణలో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రసవం జరిగే ఆసుపత్రులను ముందుగా గుర్తించి సంబంధిత గర్భిణులకు తెలియజేసి సిద్ధంగా ఉంచాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి వారికి కేటాయించి పరిధిలోని గర్భిణులకు అవసరమైన పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రసవంపై అవగాహన కల్పించాలని, గర్భిణులలో రక్తహీనత సమస్యల లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. మొదటిసారిగా గర్భం దాల్చిన మహిళలకు సాధారణ ప్రసవం జరిగే విధంగా చూడాలని, రెండవ సారి కూడా సాధారణ ప్రసవం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారి వివరాలను సేకరించాలని తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా బూస్టర్ డోస్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, అర్హులైన వారందరు టీకా తీసుకునే విధంగా ప్రచారం నిర్వహించాలని, ఆరోగ్య కార్యకర్తలకు లక్ష్యాలు నిర్ధేశించి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఉప వైద్యాధికారులు వారికి కేటాయించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పర్యవేక్షించి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించాలని తెలిపారు. డెంగ్యూ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలను భాగస్వామ్యం చేసి డ్రై డేలను పాటించాలని, క్షయ వ్యాధి నివారణలో భాగంగా అనుమానితులను గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులలో జరిగే ప్రసవాల వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేయించాలని తెలిపారు. ఆసుపత్రులలో వైద్యాధికారులు సమన్వయంతో పని చేయాలని, వ్యాధిగ్రస్తులకు సేవలు అందించడంలో సమయపాలన పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు అరవింద్, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు పర్యవేక్షకులు, వైద్యాధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.