Friday, August 14, 2026
HomeTelanganaగ్రీన్ సిటీలో అక్రమ షెడ్లపై అధికారుల ద్వంద్వ వైఖరి!

గ్రీన్ సిటీలో అక్రమ షెడ్లపై అధికారుల ద్వంద్వ వైఖరి!

పేదవాడి షెడ్డుపై వెంటనే కూల్చివేత.. పెద్ద షెడ్లపై మూడు నెలలుగా చర్యలేవీ?

📰 Generate e-Paper Clip

టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

మంచిర్యాల ఆగస్టు 14, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీలో అక్రమ షెడ్ల నిర్మాణాలపై మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో రోడ్లను ఆక్రమిస్తూ అనేక షెడ్లు నిర్మించినా మూడు నెలలుగా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఓ నిరుపేద వ్యక్తి నిర్మించుకున్న చిన్న షెడ్డును మాత్రం మరుసటి రోజే టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేయడం విమర్శలకు దారితీసింది. గ్రీన్ సిటీలో రోడ్లను ఆక్రమిస్తూ ఇనుప షెడ్లు నిర్మిస్తున్నారంటూ మూడు నెలల క్రితమే “ఆంజనేయులు న్యూస్” లో వార్తలు వెలువడ్డాయి. రోడ్లపై షెడ్ల నిర్మాణాలతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అత్యవసర సమయంలో అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు కాలనీలో ఉన్న అక్రమ షెడ్లలో ఒక్కదానిపైనా అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఓ సామాన్య, నిరుపేద వ్యక్తి ఏర్పాటు చేసుకున్న షెడ్డును మాత్రం టౌన్ ప్లానింగ్ అధికారులు తెల్లవారేసరికే కూల్చివేశారు. ఈ కూల్చివేతపై తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెద్ద ఎత్తున రోడ్లను ఆక్రమించి నిర్మించిన షెడ్లు నెలల తరబడి కొనసాగుతున్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకుండా, పేదవాడి చిన్న షెడ్డుపై మాత్రమే వేగంగా చర్యలు తీసుకోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం తప్పుకాదని, అయితే నిబంధనలు అందరికీ సమానంగా వర్తింపజేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్ సిటీలోని అన్ని షెడ్లపై సమగ్ర సర్వే నిర్వహించి, అనుమతులు లేని, రోడ్లు లేదా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన నిర్మాణాలను గుర్తించి తొలగించాలని కోరుతున్నారు. మూడు నెలల క్రితమే అక్రమ షెడ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినా స్పందించని మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు.. ఇప్పుడు ఒక్క షెడ్డుపై మాత్రం వెంటనే చర్యలు తీసుకోవడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రీన్ సిటీలోని అక్రమ షెడ్లన్నింటిపై ఒకే విధమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.