జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ హైమ పిలుపు
విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్, మహిళలు–బాలల రక్షణ చట్టాలపై అవగాహన
మంచిర్యాల ఆగస్టు 10, ( ఆంజనేయులు న్యూస్ )
డ్రగ్స్‌కు దూరంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ హైమ పిలుపునిచ్చారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో క్యాతనపల్లిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు డ్రగ్స్, షీ టీమ్ విధులు, మహిళలు, బాలల రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ హైమ మాట్లాడుతూ.. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. జిల్లాలో షీ టీమ్ నిర్వహిస్తున్న విధులు, దాని ప్రాధాన్యతతో పాటు మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టం, బాల్య వివాహాలు–వాటి పరిణామాలు, ఈవ్‌టీజింగ్, టి-సేఫ్ అప్లికేషన్, POSH చట్టం, సోషల్ మీడియా వినియోగం, సైబర్ నేరాలు, సైబర్ హెల్ప్‌లైన్ 1930, డయల్ 100 ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలని, దాని వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు దుర్వినియోగం వల్ల ఎదురయ్యే నష్టాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, పిల్లల రక్షణకు ఉన్న చట్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ సేవించినా, మహిళలను వేధించినా, రోడ్డుపై వెళ్తున్న వారిని అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ హైమ కోరారు. డయల్ 100 లేదా రామగుండం షీ టీమ్ 6303923700 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుల్స్ శ్రవణ్, శ్రీలత పాల్గొన్నారు.
